Made in India Arattai App: ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోట్లాది ప్రజలు వాట్సాప్‌ను విపరీతంగా వాడుతుంటారు. అటువంటి యాప్‌కు గట్టి పోటీనిచ్చేందుకు ఓ భారతీయ యాప్ సిద్ధమైంది. తాజాగా చెన్నైకి చెందిన జోహో కార్పొరేషన్ వాట్సాప్‌కు పోటీగా అరట్టై పేరుతో ఒక కొత్త మెసేజింగ్ యాప్‌ను లాంచ్ చేసింది. తమిళంలో దీని అర్థం ‘మాట్లాడుకోవడం’ అని. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ‘ఆత్మనిర్భర్ భారత్’ పిలుపులో భాగంగా.. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే దిశగా కేంద్ర మంత్రుల మద్దతుతో ఇది ప్రారంభమైంది. ఈ అరట్టై యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. దీనిని ఫ్రీగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా నిలవాలని కంపెనీ లక్ష్యంగా రిలీజైన ఈ మెసేజింగ్ యాప్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
అదరగొట్టే అరట్టై ఫీచర్స్..
- అరట్టైలో టెక్స్ట్ మెసేజ్‌లు, వాయిస్ నోట్‌లు, ఆడియో, వీడియో కాల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
2. అరట్టై యాప్ గరిష్టంగా 1,000 మంది సభ్యులతో గ్రూప్ చాట్‌లను క్రియేట్ చేసుకునేందుకు సపోర్ట్ చేస్తుంది. అలాగే అప్‌డేట్‌లు, వార్తలను ఇతరులకు షేర్ చేయడానికి ఛానెల్స్, స్టోరీస్ (వాట్సాప్ స్టేటస్ తరహాలో) ఫీచర్లను దీనిలో పొందుపర్చారు.
౩. యూజర్లు ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్‌లు వంటి ఫైళ్లను షేర్ చేసుకునే విధంగా దీన్ని రూపొందించారు. ఈ యాప్ తక్కువ బ్యాండ్‌విడ్త్ ఉన్న ప్రాంతాల్లోనూ వేగంగా పనిచేస్తుంది.
4. అరట్టై యూజర్ డేటాను భారతీయ సర్వర్లలో మాత్రమే స్టోర్ చేస్తుంది. మరీ ముఖ్యంగా యాప్ వాయిస్, వీడియో కాల్స్‌కు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను అందిస్తుంది. అయితే, ప్రస్తుతం సాధారణ టెక్స్ట్ మెసేజ్‌లకు మాత్రం పూర్తి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సౌకర్యం లేదు. ఈ ఫీచర్‌ను త్వరలోనే తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు జోహో కంపెనీ తెలిపింది.
5. మొబైల్‌తో పాటు డెస్క్‌టాప్, ఆండ్రాయిడ్ టీవీ వంటి వివిధ డివైజ్‌లలోనూ అరట్టై యాప్‌ను యూజ్ చేసుకోవచ్చు.
స్పెషల్ ఫీచర్లు ఇవే..
1 యూజర్లు తమ ముఖ్యమైన నోట్‌లు, మీడియా ఫైళ్లను స్టోర్ చేసుకునేందుకు వీలుగా దీనిలో పర్సనల్ క్లౌడ్ స్టోరేజ్ ఉంటుంది.
2. అరట్టై యాప్‌లోనే వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్స్‌ను షెడ్యూల్ చేసుకోవచ్చు.
౩. వాట్సాప్‌తో పోలిస్తే.. అరట్టై మెసేజ్ ఎన్‌క్రిప్షన్ విషయంలో ఒక అడుగు వెనుకబడే ఉంది. అయినప్పటికీ ‘మేడ్ ఇన్ ఇండియా’ పేరు, యూజర్ డేటా ప్రైవసీకి అధిక ప్రాధాన్యతనిస్తుంది. అందుకే దీని డౌన్‌లోడ్స్ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. జోహో సీఈఓ శ్రీధర్ వెంబు తెలిపిన వివరాల ప్రకారం, ఈ యాప్ ట్రాఫిక్ కేవలం మూడు రోజుల్లోనే 100 రెట్లు పెరిగిందని ఆనందం వ్యక్తం చేశారు.


