Mahindra Scorpio-N Launched: ప్రసిద్ధి చెందిన SUV మహీంద్రా స్కార్పియో-ఎన్ గతంలో కంటే మరింత శక్తివంతంగా, అధునాతన ఫీచర్లతో మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తోంది. కంపెనీ స్కార్పియో-ఎన్ కారులో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) లెవల్ 2 టెక్నాలజీని చేర్చింది. దీనితో పాటు..కంపెనీ తన కొత్త Z8T వేరియంట్‌ను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. కాగా, ఈ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 20.29 లక్షలుగా పేర్కొంది. అయితే, ఇప్పుడు మహీంద్రా స్కార్పియో-ఎన్ కారులో ఎలాంటి ఫీచర్లు అందించారో ఇక్కడ తెలుసుకుందాం.
కంపెనీ ఈ ప్రసిద్ధ SUVని మునుపటి కంటే సురక్షితంగా చేసింది. సాంకేతికత, భద్రతను ఇవ్వడానికి మహీంద్రా దాని ప్రీమియం Z8L వేరియంట్‌కు లెవల్ 2 ADASను జోడించింది. ఇందులో ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ఢీకొన్నప్పుడు వాహనాన్ని ఆటోమేటిక్‌గా బ్రేక్ చేయడానికి ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ ను తీసుకొచ్చారు.
అంతేకాకుండా ముందున్న వాహనాన్ని బట్టి దాని వేగాన్ని ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేయడానికి స్టాప్ & గోతో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, హైవేలపై డ్రైవింగ్‌ను సులభతరం చేయడానికి, సురక్షితంగా చేయడానికి స్మార్ట్ పైలట్ అసిస్ట్, లేన్ నుండి బయటకు వెళ్లేటప్పుడు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడానికి లేన్ డిపార్చర్ వార్నింగ్, వాహనాన్ని దాని లేన్‌లో ఉంచడంలో సహాయపడటానికి లేన్ కీప్ అసిస్ట్ జోడించారు.
అలాగే, రోడ్డుపై ట్రాఫిక్ సంకేతాలను గుర్తించడం ద్వారా డ్రైవర్‌కు తెలియజేయడానికి ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, రాబోయే ట్రాఫిక్ ప్రకారం హెడ్‌లైట్, హై బీమ్‌ను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేయడానికి హై బీమ్ అసిస్ట్ వంటి లక్షణాలు తీసుకొచ్చారు.
దీనితో పాటు, కంపెనీ మహీంద్రా స్కార్పియో-ఎన్‌లో మొదటిసారిగా స్పీడ్ లిమిట్ అసిస్ట్, ఫ్రంట్ వెహికల్ స్టార్ట్ అలర్ట్ వంటి అద్భుతమైన లక్షణాలను కూడా అందించింది. స్పీడ్ లిమిట్ అసిస్ట్ ఫీచర్ రోడ్డు కోసం సెట్ చేయబడిన వేగం ఆధారంగా డ్రైవర్‌ను అలెర్ట్ చేస్తుంది. ఇక ట్రాఫిక్ సమయంలో ముందు ఉన్న వాహనం వెళ్లడం ప్రారంభిస్తే ఫ్రంట్ వెహికల్ స్టార్ట్ అలర్ట్ డ్రైవర్‌ను విజువల్, సౌండ్, వైబ్రేషన్ ద్వారా గుర్తుచేస్తుంది.
స్కార్పియో-ఎన్ కొత్త వేరియంట్ Z8T
మహీంద్రా Z8, Z8L వేరియంట్‌ల మధ్య కొత్త Z8T వేరియంట్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. ఇది చాలా ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో R18 డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, 12-స్పీకర్ సోనీ-బ్రాండెడ్ ఆడియో సిస్టమ్, ఫ్రంట్ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్, 6-వే పవర్డ్ డ్రైవర్ సీటు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ (EPB), వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటో-డిమ్మింగ్ IRVM వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.