Side Efeects and Disadvantages of Earphones: ఫొన్ వాడుతున్న చాలా మంది ఇయర్‌ఫోన్స్ కూడా వాడుతుంటారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఇయర్ ఫోన్స్ మన శరీరంలో భాగమైపోయాయి. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకునే మన రోజూవారి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. అయితే, ఇలా ఇయర్ ఫోన్స్ విపరీతంగా వినియోగించడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల వినికిడి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. ఓ అధ్యయనం ప్రకారం, 35 ఏళ్లలోపు యువత మ్యూజిక్ వినడానికి ఇయర్ ఫోన్‌లు వాడుతుంటే.. వారిలో దాదాపు 50 శాతం మంది ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటున్నారని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇయర్ ఫోన్స్ వాడితే తాత్కాలిక, శాశ్వత వినికిడి లోపానికి దారితీస్తుందని చెబుతున్నారు. మీరు ఎక్కువ సేపు ఇయర్ ఫోన్స్ వాడితే.. చెవిలో ఉండే హెయిర్ సెల్స్ వైబ్రేషన్స్‌పై ప్రభావం పడుతుంది. హెయిర్ సెల్స్ వాటి సున్నితత్వాన్ని కోల్పోయి కిందికి వంగి ఉంటాయి. తద్వారా వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఎక్కువ సౌండ్‌తో వినకండి
సౌండ్‌ను డెసిబెల్స్‌లో కొలుస్తారు. సౌండ్ 60 డెసిబెల్స్ కంటే తక్కవగా ఉండేలా చూసుకోండి. మన ఫోన్లలో సౌండ్‌ను కొలవడం కష్టం.. చెవులకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు వాల్యూమ్‌ను 50% సెట్టింగ్‌లో ఉంచడంతో పాటు, వినే సమయాన్ని తగ్గించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
గ్యాప్ ఇవ్వండి
గంటల తరబడి ఇయర్‌ఫోన్స్‌లో సంగీతం వినడం వల్ల వినికిడి లోపం, చెవుల నొప్పి, తలతిరగడం వంటి సమస్యలు వస్తాయి. ఇయర్‌ఫోన్స్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల చెవులు సున్నితంగా మారడమే కాకుండా, చెవులో నొప్పికి దారితీయవచ్చు. కాబట్టి, ఇయర్‌ఫోన్‌లతో సంగీతం వినేటప్పుడు కొంచెం సేపు చెవులకు రెస్ట్ ఇవ్వడం ఉత్తమం.
హెడ్ ఫోన్స్ వాడండి
మనం సాధారణంగా ఇయర్ ఫోన్స్‌ను హెడ్ ఫోన్స్ అని పిలుస్తాం. కానీ అవి రెండూ ఒకటి కాదు. ఇయర్ ఫోన్‌లు చిన్నాగా చెవిలో సరిపోయేట్టు ఉంటాయి. హెడ్ ఫోన్లు చెవిమీద పెడతాం. హెడ్‌ఫోన్లు పెట్టుకుంటే.. శబ్ధానికి, కర్ణభేరి మధ్య గ్యా్ ఉంటుంది. తద్వారా చెవిపై అంతగా ప్రభావం చూపవు. కానీ, ఇయర్‌ఫోన్స్, ఇయర్‌బడ్స్ వల్ల చెవులకు ప్రమాదం ఉంటుంది.
ఇతరుల ఇయర్‌ఫోన్స్ వాడకండి
వేరే వారి ఇయర్‌ఫోన్స్ వాడకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇది బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ల వ్యాప్తికి దారితీస్తుంది. మీ చెవుల నుండి సహజంగా వచ్చే చెవిలో గులిమి, చర్మంపై ఉండే బ్యాక్టీరియా ఇతరులకు అంటుకోవచ్చు. అలాగే, ఇతరుల చెవుల్లో ఉండే ఇన్ఫెక్షన్లు మీకు సంక్రమించే ప్రమాదం కూడా ఉంటుంది.


