మారుమూల ప్రాంతాల్లో కొన్ని టెలికం కంపెనీల సిగ్నల్స్ సరిగా ఉండవు. కొన్ని చోట్ల ఏదో ఒక నెట్‌వర్క్ సిగ్నల్ మాత్రమే పనిచేస్తుంది. జియో సిగ్నల్ ఉంటే ఎయిర్‌టెల్ ఉండదు.. ఎయిర్‌టెల్ ఉంటే మరో కంపెనీ సిగ్నల్ ఉండదు. దీంతో అత్యవసర సమయాల్లో సిగ్నల్స్ అందక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేలా కేంద్ర టెలికం శాఖ ఇంట్రా సర్కిల్ రోమింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా దేశంలో గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు టెలికాం సేవలు అందించాలన్న ఉద్దేశంతో డిజిటల్ భారత్ నిధి (DBN) కార్యక్రమాన్ని కేంద్రం తీసుకొచ్చింది.
సాధారణంగా భారత్‌లోని ఫోన్ నంబర్‌తోనే విదేశాల్లో కాల్స్ చేసుకోవడానికి, ఇంటర్నెట్ వాడుకోవడానికి ‘రోమింగ్’ సదుపాయం ఉంటుంది. ఇదే తరహాలో దేశంలోనూ అంతర్గతంగా ‘ఇంట్రా సర్కిల్ రోమింగ్(Intra Circle Roaming)’ విధానాన్ని కేంద్రం ప్రారంభించింది. డీబీఎన్ నిధులతో ఏర్పాటైన మౌలిక సదుపాయాలను పంచుకోవడానికి ప్రస్తుతం ఎయిర్‌టెల్, జియో, బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రమే ముందుకొచ్చాయి. దీంతో ఒకే టవర్ ద్వారా ఆయా టెలికాం సంస్థల వినియోగదారులు 4జీ సేవలను పొందొచ్చని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 27,836 డీబీఎన్ టవర్లు ఉండగా.. దీని వల్ల 35,400 మారుమూల గ్రామాలు లబ్ధి పొందనున్నాయి.