Tesla India Halloween Mode update : రోడ్డుపై వెళ్లే కారు హఠాత్తుగా దెయ్యంలా మారి వింత శబ్దాలు చేస్తే? కారు డోర్ తెరవబోతే వెన్నులో వణుకు పుట్టించేలా కేకలు వేస్తే? వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా.. ఎలక్ట్రిక్ కార్ల రారాజు ‘టెస్లా’ సరిగ్గా ఇలాంటి అనుభూతినే వినియోగదారులకు పరిచయం చేసింది. భారత్‌లోని తన పాపులర్ ఎలక్ట్రిక్ SUVలు ‘మోడల్ Y’, ‘మోడల్ Y L’ కార్ల కోసం ప్రత్యేకంగా సరికొత్త ‘హాలోవీన్ మోడ్’ను తీసుకొచ్చింది. పండుగ వేళ వాహన ప్రియులను కట్టిపడేస్తున్న ఈ వినూత్న సాఫ్ట్వేర్ మాయాజాలం ఏమిటి? అసలు ఈ కారు లోపల దాగి ఉన్న విశేషాలేంటి?
ఇంట్లోనే ఓటీఏ అప్డేట్.. దెయ్యాల థీమ్ :
టెస్లా కార్ల యజమానులు సర్వీస్ సెంటర్లకు వెళ్లకుండానే ‘ఓవర్-ది-ఎయిర్’ (OTA) ద్వారా ఈ ఫీచర్‌ను సులువుగా అప్డేట్ చేసుకోవచ్చు. పరిమిత కాలం పాటు అందుబాటులో ఉండే ఈ మోడ్‌లో థ్రిల్లింగ్ అనుభూతినిచ్చే అంశాలివే:
ట్రిక్ ఆర్ ట్రీట్ & వాయిస్ ఫ్రమ్ బియాండ్: కారు సమీపానికి ఎవరైనా వచ్చినా లేదా డోర్ తాకినా వింత శబ్దాలు, మినుకుమినుకుమనే లైట్లతో వాహనం దడపుట్టిస్తుంది. టెస్లా మొబైల్ యాప్ ద్వారా యజమాని పంపే వాయిస్ మెసేజ్ బయటి స్పీకర్ల ద్వారా భీకర శబ్దాలతో ప్రతిధ్వనిస్తుంది.
ప్రత్యేక డిజైన్లు & ఇన్-కార్ ఫొటోబూత్: కారు స్క్రీన్‌పై వాహనం తెల్లటి దెయ్యంలా కనిపించడం, అస్థిపంజరాల గ్రాఫిక్స్, కారు లాక్ చేసినప్పుడు వింత కేకలు రావడం ప్రధాన ఆకర్షణ. అలాగే క్యాబిన్ కెమెరాతో దెయ్యాలు, గుమ్మడికాయ ఫ్రేములతో సెల్ఫీలు తీసుకునే ‘ఇన్-కార్ ఫొటోబూత్’ సదుపాయాన్ని కూడా పొందుపరిచారు.
గాల్లో చక్కర్లు కొట్టే ‘రోడ్‌స్టర్’.. భారత్‌లో బుకింగ్స్ : మరోవైపు, అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ఎక్స్ (SpaceX) భాగస్వామ్యంతో రూపొందించిన సెకండ్ జనరేషన్ ‘రోడ్‌స్టర్’ నమూనాను టెస్లా ఆవిష్కరించింది. ‘కోల్డ్-గ్యాస్ థ్రస్టర్ల’ సాయంతో గాల్లోకి ఎగిరి చక్కర్లు కొట్టి సురక్షితంగా ల్యాండయ్యే ఈ సూపర్ కారు కోసం టెస్లా ఇండియా తన అధికారిక వెబ్సైట్లో బుకింగ్‌లను సైతం ప్రారంభించింది.

