WhatsApp, Telegram: వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్ యూజర్లకు కేంద్రం షాకిచ్చింది. సిమ్ లేకున్నా మెసేజింగ్ యాప్‌లను వినియోగించే సదుపాయానికి చెక్ పెట్టనుంది. వచ్చే నెల నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
మార్చి 1 నుంచి వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌లకు ఫోన్‌లలో యాక్టివ్ సిమ్ కార్డు తప్పనిసరి చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యాప్స్‌కు సంబంధించిన సిమ్ బైండింగ్ నిబంధనలు ఆదివారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధన అమల్లోకి వస్తే, ఇకపై సిమ్ లేకుండా మెసేంజర్ యాప్స్‌ను ఫోన్‌లో వినియోగించుకోలేరు. గతేడాది నవంబరులో ఈ నిబంధనలు ప్రకటించినా.. వీటిని అమలు చేయడానికి ఆయా సంస్థలకు ప్రభుత్వం ఫిబ్రవరి 28 వరకు గడువు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గడువు రేపటితో ముగియనుండటంతో.. ఆదివారం నుంచి సిమ్ లేకుంటే ఆయా యాప్స్ ఫోన్‌లో పనిచేసే అవకాశం ఉండదని తెలుస్తోంది.
ఎవరైనా సిమ్ లేకుంటే యాప్స్ ఉపయోగిస్తుంటే ఆ ఫోన్‌లలో ఈ యాప్ నిలిచిపోనుంది. ఇక పీసీల్లో వాట్సాప్ వెబ్ కూడా ప్రతి ఆరు గంటలకు ఒకసారి లాగౌట్ అవుతుందని కేంద్రం తెలిపింది. ఆరు గంటలకోసారి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, అరట్టై వంటి కమ్యూనికేషన్ యాప్స్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి కొత్త నిబంధనను తీసుకువచ్చినట్లు కేంద్రం పేర్కొంది. దీంతో ఈ యాప్స్‌కు సిమ్ కార్డు బైండింగ్‌ను తప్పనిసరి చేస్తూ టెలికాం విభాగం(డాట్) ఆదేశాలిచ్చింది.

