Monday, July 14, 2025
HomeTS జిల్లా వార్తలుAnti Drug Day: డ్రగ్స్‌పై ‘ఈగల్’ : సీఎం రేవంత్

Anti Drug Day: డ్రగ్స్‌పై ‘ఈగల్’ : సీఎం రేవంత్

CM Revanth Speech: యువత డ్రగ్స్ బారిన పడినట్టు వస్తున్న వార్తలు చూస్తుంటే ఆవేదన కలుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ‘మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి అమ్మితే వెన్ను విరిచేస్తామని హెచ్చరించాం. చెప్పినట్లే చేస్తాం.. డ్రగ్స్ వాడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం’ అని మరోసారి సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హీరోల సినిమా పాత్రలను కాకుండా, నిజజీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా మెగాస్టార్ చిరంజీవి డ్రగ్స్‌ జోలికి వెళ్లలేదని చెప్పారు. ఎక్కడ గంజాయి పండించినా ఈగల్‌ వ్యవస్థ కనిపెడుతుందన్నారు. నేటి నుంచి తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోని ఈగల్‌(ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్)గా మారుస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఈగల్‌ లోగోను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. డ్రగ్స్‌ నియంత్రణ కోసం ఈగల్‌ వ్యవస్థని ఏర్పాటు చేశామని తెలిపారు. డ్రగ్స్‌, గంజాయి అమ్మితే వెన్నువిరిచేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఉద్యమాల గడ్డ మాదక ద్రవ్యాలకు బానిస అయితే తెలంగాణకే అవమానమని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు

ALSO READ: https://teluguprabha.net/cinema-news/those-who-take-drugs-should-be-banned-in-tollywood-dil-raju-sensational-comments/
యువత గంజాయి, డ్రగ్స్‌కు బానిసలైతే దేశ మనుగడకే ప్రమాదమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. డ్రగ్స్‌ నివారణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవాలన్నారు. తెలంగాణ అంటే ఐటీ, ఫార్మా రంగాలకు ప్రాచుర్యం పొందిందని.. ఈక్రమంలో డ్రగ్స్‌ హబ్‌గా మారొద్దని హెచ్చరించారు. ప్రపంచంతో పోటీపడే శక్తి తెలంగాణకు ఉందని ఉద్ఘాటించారు. దేశానికి హరియాణా, పంజాబ్ రాష్ట్రాలు ఉక్కు కవచంగా ఉండాల్సింది పోయి.. ఆ రాష్ట్రాల్లోని యువత డ్రగ్స్‌కు బానిసలయ్యారు. యువతకు స్ఫూర్తిని, ఆదర్శంగా నిలవడానికి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చాను. యువతను సరైన మార్గంలో పెట్టాలి. వారికి సరైన అవకాశాలు కల్పించాలని స్పోర్ట్స్ పాలసీ, స్కిల్ యూనివర్సిటీని తీసుకువచ్చాం. డిమాండ్ అండ్ సప్లై‌లో ఉన్న గ్యాప్‌ని నింపడానికి స్కిల్ యూనివర్సిటీని తీసుకువచ్చాం’ అని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

తండ్రిగా చెబుతున్నా: రామ్ చరణ్
‘ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే నాకు స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. చిన్నప్పుడు ఇలాంటి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్‌లో చాలా పాల్గొనేవాడిని. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు గర్వంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు. స్కూల్‌ పిల్లలు కూడా డ్రగ్స్‌కు బానిస అవుతున్నట్లు రోజూ వార్తలు చూస్తున్నాం.. ఈ వార్తలు చాలా బాధ కలిగిస్తున్నాయి’ అని హీరో రామ్ చరణ్ అన్నారు. ‘నేను తండ్రిగా చెబుతున్నా.. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. డ్రగ్స్‌కు దూరంగా ఉంచండి. జీవితంలో ఏదో సాధించడానికి కృషి చేయాలి. అప్పుడు ఇలాంటి డ్రగ్స్ మీదకు దృష్టి వెళ్లదు. తప్పకుండా డ్రగ్స్‌కు దూరంగా ఉందాం. దీనిపై అందరం ఒక సోల్జర్‌గా పోరాటం చేద్దాం’ అని రామ్ చరణ్ పిలుపునిచ్చారు.


డ్రగ్స్ బ్యాచ్‌కు దూరంగా ఉండాలి: విజయ్
‘మన చుట్టూ డ్రగ్స్ ట్రై చేయమనే బ్యాచ్ ఉంటుంది. అలాంటి వాళ్ల ఒత్తిడితో ఒక్కసారి అలవాటైతే బయటకి రాలేం’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. అలాంటి వాళ్లకు దూరంగా ఉంటే మంచిదని సూచించారు. యంగ్ ఏజ్‌లో కేర్ ఫుల్‌గా ఉండాలని హెచ్చరించారు. ‘మన కంట్రీ పవర్.. స్టేట్ పవర్ మన యూత్ అని.. యూత్‌ను పాడు చేస్తే కంట్రీని నాశనం చేయవచ్చని ఇండియాలోకి డ్రగ్స్ పంపుతున్నారు’ అని అన్నారు. సమాజంలో డ్రగ్స్ తీసుకునేవారిని చిన్నచూపు చూస్తారని, అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం అవసరమా? అని ప్రశ్నించారు. ‘నా అభిమానులు, తెలుగు సినిమా ఫ్యాన్స్, టోటల్ తెలంగాణ యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని కోరుతున్నా’ అని నటుడు విజయ్ దేవరకొండ అన్నారు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/news-viral-on-kannappa-advance-bookings/

డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: పుల్లెల గోపీచంద్
‘డ్రగ్స్, స్మోకింగ్ చాలా సంతోషం ఇస్తాయని కొంతమంది అనుకుంటారు. కానీ, అదంతా భ్రమే’ అని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తెలిపారు. ఒక్కసారే అని చెప్పి డ్రగ్స్‌ అలవాటుగా చేసుకోని జీవితాలను కోల్పోతున్నారని అన్నారు. ఒక్కసారి డ్రగ్స్‌కి దూరంగా ఉండాలని పుల్లెల గోపీచంద్ సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News