Sigachi Plant Blast: పాశమైలారం అత్యంత విషాదకరమైన ఘటన అని, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ ఇలాంటి ప్రాణ నష్టం జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితుల్లో బిహార్, ఒడిస్సా, మధ్యప్రదేశ్, ఏపీ, తెలంగాణకు చెందిన కార్మికులు ఉన్నట్లు రేవంత్ వివరించారు. పరిశ్రమ నుంచి మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ప్రమాద ఘటనను మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, దామోదర, వివేక్, శ్రీధర్ బాబుతో కలిసి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు, సహాయక చర్యల్లో పురోగతిపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం మీడియాతో సీఎం మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో 143 మంది ఉన్నట్లు తెలిసిందన్నారు. ఇప్పటి వరకు 39 మంది మృతి చెందినట్లు గుర్తించగా మరో 43 మంది గల్లంతు అయినట్లు సమాచారం ఉందన్నారు. మంత్రులు, అధికారులు నిత్యం ప్రమాద ఘటన వద్ద సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తరఫున బాధితులకు పూర్తి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు.
ప్రమాదానికి సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద మృతుల కుటుంబాలకు 1 లక్ష రూపాయలు, గాయపడిన వారికి రూ.50 వేలు అందించాలని ఆదేశించిన సీఎం ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని, వైద్యా ఖర్చులకు వెనకాడవద్దని, అవసరమైతే ప్రభుత్వమే వారి వైద్య ఖర్చులను భరించేందుకు సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. మృతుల కుటుంబాల్లో చదువుకునే పిల్లలను ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివించేలా చూడాలని అధికారులను రేవంత్ ఆదేశించారు.
ALSO READ: https://teluguprabha.net/telangana-news/sigachi-plant-blast-updates/
ఘటనకు సంబంధించి డీటెయిల్డ్ రిపోర్ట్ సమర్పించాలని అధికారులను ఆదేశించారు. నష్టపరిహారం కాదని, కేవలం తక్షణ సాయం మాత్రమే అని సీఎం స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రసాయన కంపెనీల్లో తనిఖీలు నిర్వహించి లోపాలు గుర్తించాలని ఆదేశించారు. సహాయక చర్యలకు సంబంధించి విభాగాల మధ్య సమన్వయం చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం తెలిపారు.
కాగా, నిన్న సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలి ప్రమాదం చోటుచేసుకోగా, ఈ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 39 మంది మృతి చెందినట్లు గుర్తించగా మరో 43 మంది గల్లంతు అయినట్లు సమాచారం. పేలుడు తీవ్రతకు ఉత్పత్తి విభాగం ఉన్న 3 అంతస్థుల భవనం కూలిపోగా.. మరో భవనానికి బీటలు వారిన విషయం తెలిసిందే. అయితే, శిథిలాల కింద మరింత మంది మృతదేహాలు ఉండే అవకాశం ఉంది.