Credai Hyderabad: భారతదేశంలోని ప్రైవేట్ రియల్ ఎస్టేట్ అభివృద్ధిదారుల అత్యున్నత సంస్థ క్రెడాయ్ (కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా), హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న హైదరాబాద్ ప్రాపర్టీ షో – 2025 ని అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రదర్శన ఆగస్టు 15 నుంచి 17 వరకు, హైటెక్స్ ప్రదర్శన కేంద్రం హాల్ 1 అండ్ 3లో నిర్వహించనున్నారు.
ఈ ఏడాది థీమ్ “ఎంచుకోవాల్సింది మీరే” (Choice Is Yours). ఇది గృహ కొనుగోలుదారులకు స్వేచ్ఛగా, పారదర్శకంగా, నమ్మకంగా తమ అవసరాలకు తగిన ఇంటిని ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పించాలనే సంకల్పానికి ప్రతినిధిగా నిలుస్తుంది.
ఈ ప్రకటనను క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎన్. జైదీప్ రెడ్డి నేతృత్వంలోని బృందం గురువారం విడుదల చేసింది. కార్యక్రమంలో బి. జగన్నాథ్ రావు (ఎన్నికైన అధ్యక్షుడు), కె. కాంతి కిరణ్ రెడ్డి (ప్రధాన కార్యదర్శి), కుర్ర శ్రీనాథ్ (కన్వీనర్), అరవింద్ రావు మెచినేని (సహ కన్వీనర్) పాల్గొన్నారు. ఇతర కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ అగర్వాల్, కె. అనిల్ రెడ్డి, వై. రవి ప్రసాద్ (ఉపాధ్యక్షుడు), నితీష్ రెడ్డి గుడూరు (ఖజానాదారు), సంజయ్ కుమార్ బన్సాల్, శ్రీరామ్ ముసునూరు (సంయుక్త కార్యదర్శులు) పాల్గొన్నారు.
నగరంలోని అతిపెద్ద గృహ ప్రదర్శన: అగ్ర నిర్మాణ సంస్థలు ఒకేచోట
రియల్ ఎస్టేట్‌పై నెలకొన్న అపోహలకు స్వస్తి చెప్పే వేళ వచ్చిందని క్రెడై హైదరాబాద్ స్పష్టం చేసింది. నిజాలు చెప్పే ప్రయత్నమే ఈ ప్రదర్శన లక్ష్యమని పేర్కొంది. అపోహలు తొలగించేందుకు, స్పష్టతను కలిగించేందుకు, నిజమైన అవకాశాలను అందించేందుకు ఈ వేదిక సిద్ధమైందని తెలిపారు. ఈ గృహ ప్రదర్శనలో కేవలం రెరా ఆమోదం పొందిన ప్రాజెక్టులకే చోటు అని స్పష్టం చేశారు. అన్నీ క్రెడాయ్ సభ్య డెవలపర్ల ప్రాజెక్టులే ఇందులో భాగం కావడం విశేషం. నగరమంతా విస్తరించిన అపార్ట్‌మెంట్లు, విల్లాలు, ప్లాట్లు, వాణిజ్య ప్రాంగణాలు… ఇవన్నీ ఒకే వేదికపై ప్రదర్శించనున్నారు. ఇల్లు కొనాలనుకునే వారికి ఇది నమ్మకమైన ఎంపికలతో కూడిన సర్వసిద్ధ వేదిక కానుంది.
4,300 కోట్ల విలువైన ఆస్తుల రిజిస్ట్రేషన్లు
సమావేశంలో క్రెడాయ్ అధ్యక్షుడు జైదీప్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం బలమైన స్థిరత్వాన్ని, ధృడమైన భవిష్యత్ దృక్పథాన్ని చూపిస్తోందన్నారు. స్థిరమైన అభివృద్ధి, నిరంతర డిమాండ్, కొనుగోలుదారుల నమ్మకం పెరగడం ఈ రంగాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రధాన కారకాలు అని చెప్పారు. 2025 మే నెలలో మాత్రమే నగరంలో 4,300 కోట్ల విలువైన ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగడం ద్వారా సంవత్సరానుక్రమంగా 14 శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. ఈ స్థిరమైన వృద్ధికి ఉద్యోగావకాశ కేంద్రాల విస్తరణ, పెట్టుబడులకు అనుకూల వాతావరణం, అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాలు కారణమని ఆయన పేర్కొన్నారు.2030 నాటికి నగరంలో 200 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అవసరం ఉంటుందని అంచనా. ఇది గ్లోబల్ సంస్థల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను బట్టి కనిపిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గత బడ్జెట్లో మెట్రో రైలు విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లు, ఇతర మౌలిక ప్రాజెక్టులపై భారీ పెట్టుబడులు ప్రకటించడం నగరానికి పెద్ద మలుపు తిప్పుతుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే వాటి పనులు భౌతికంగా మొదలైతే, నగర మౌలిక వసతులకు విప్లవాత్మక మార్పులు సంభవిస్తాయని అభిప్రాయపడ్డారు.
పెట్టుబడిదారులకు హైదరాబాద్ మొదటి ఎంపిక
నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు జగన్నాథ్ రావు మాట్లాడుతూ హైదరాబాద్ నిజమైన గ్లోబల్ నగరంగా స్థిరపడిందన్నారు. వ్యాపార మాంద్యాల సమయంలోనూ ఈ నగరం చూపించిన స్థైర్యం ఎంతో అభినందనీయమని కొనియడారు. ఉన్నత స్థాయి మౌలిక వసతులు, చల్లని వాతావరణం, ప్రతిభావంతులైన మానవ వనరుల లభ్యత, వ్యాపారాలకు అనుకూల విధానాలు, భద్రమైన జీవన వాతావరణం వంటి అనేక అంశాల నేపథ్యంలో నగరానికి వివిధ రంగాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా తొలచిపోతున్న పరిస్థితుల మధ్యలో కూడా, గ్లోబల్ పెట్టుబడిదారులకు హైదరాబాద్ మొదటి ఎంపికగా నిలుస్తోందని, నగర వృద్ధిపై నమ్మకం స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.ఈ పరిస్థితుల్లో హైదరాబాద్లో ప్రాపర్టీ కొనుగోలు చేయడం మంచి నిర్ణయం అవుతుందని పేర్కొన్నారు.
70కి పైగా ప్రతిష్ఠాత్మక క్రెడాయ్ డెవలపర్లు
క్రెడాయ్ కన్వీనర్ కుర్ర శ్రీనాథ్ మాట్లాడుతూ ఈ ఏడాది ప్రాపర్టీ షో కేవలం రియల్ ఎస్టేట్ ప్రదర్శన మాత్రమే కాదని, ఇది ఎంపిక, నమ్మకం, సమాజ బంధానికి సంకేతమని అన్నారు. 70కి పైగా ప్రతిష్ఠాత్మక క్రెడాయ్ డెవలపర్లు ఒకే వేదికపై భాగస్వాములవుతుండటంతో, ఇల్లు మాత్రమే కాదని, విశ్వాసం, ఆత్మవిశ్వాసాన్ని కూడా ఈ ప్రదర్శన తీసుకురానుందని పేర్కొన్నారు. నగరంలోని టాప్ ప్రాజెక్టులన్నీ ఒకే చోట ఉన్నప్పుడు, ప్రతి వీకెండ్ సైట్ల కోసం తిరుగుతూ మీ సమయాన్ని వృథా చేసుకోవవద్దని, ఆగస్టు 15 నుంచి 17 వరకు హైటెక్స్ కేంద్రంలో జరుగనున్న క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోని సందర్శించాలని కోరారు.
కార్యక్రమంలో అదనంగా, సుశీల్ కుమార్ జైన్, బి. జైపాల్ రెడ్డి, ఏ. వెంకట్ రెడ్డి, సి. అమరేంద్ర రెడ్డి, బి. వినోద్ రెడ్డి, ఎన్. వేణుగోపాల్, మతి కావ్య కవూరి, శ్రీ అద్దుల గోపాల్ రెడ్డి, ఎం. నంద కిషోర్, శ్రావణ్ కుమార్ గొనె, పీయూష్ అగర్వాల్, మతి ఐశ్వర్య, ఆర్. సురేశ్ కుమార్ వంటి మేనేజింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


