Heavy Rains: కామారెడ్డి జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రోడ్డుపై నిలిపిన కార్లు వరద ధాటికి నీటిలో కొట్టుకుపోయాయి. రైలు పట్టాలు నీట మునగడంతో రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. బీబీపేట నుంచి కామారెడ్డి వైపు వెళ్లే రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. హౌసింగ్ బోర్డు కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు.
రైలు పట్టాల కింద వరద
భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎల్లారెడ్డి మండలంలో భారీగా వరద ప్రవహిస్తోంది. కామారెడ్డి -భిక్కనూర్ మార్గంలో రైలు పట్టాల కింద వరద పోటెత్తడంతో భారీ గండిపడింది. దీంతో అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.
లక్ష్మాపూర్ వద్ద తెగిన రోడ్డు
ఎల్లారెడ్డి, లింగంపేట్, నాగిరెడ్డిపేట, గాంధారి మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. ఈ వాన కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కామారెడ్డి- ఎల్లారెడ్డి మార్గంలో లక్ష్మాపూర్ గ్రామం వద్ద రోడ్డు కోతకు గురైంది. దీంతో రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
భిక్కనూరు- హైదరాబాద్ హైవే మూసివేత
భిక్కనూరులో వర్షం బీభత్సం సృష్టించింది. భిక్కనూరు- హైదరాబాద్ హైవే జలమయమైంది. రాకపోకలు నిలిపోయాయి. టోల్ ప్లాజా సమీపంలో ఉన్న ఎడ్ల కట్ట వాగు వంతెన నుంచి పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తుండడం వలన అంతంపల్లి నుంచి లక్ష్మీ దేవుని పల్లికి రాకపోకలు నిలిచిపోవడంతో పాటు, లక్ష్మీ దేవునిపల్లి చెరువు పెద్ద ఎత్తున అలుగు పారుతుంది. దీంతో అతి కష్టం మీద భిక్కనూరు నుంచి గ్రామంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.


