IT Raids: హైదరాబాద్‌లో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ సోదాలు జరిపింది. ప్రధానంగా డీఎస్ఆర్ గ్రూప్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థతో పాటు, ఆ సంస్థతో ఆర్థిక లావాదేవీలు జరిపిన ప్రముఖులు లక్ష్యంగా ఈ దాడులు చేపట్టారు . ఇందులో భాగంగా చేవెళ్ల మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు గడ్డం రంజిత్ రెడ్డి నివాసంలో గత రెండు రోజులుగా సోదాలు కొనసాగుతున్నాయి.
మంగళవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ తనిఖీలు నిన్న అర్ధరాత్రి వరకు జరిగాయి. ఒక బృందం రంజిత్ రెడ్డి ఇంట్లో కీలక పత్రాల పరిశీలనలో నిమగ్నమై ఉంది. ఈ సోదాల ప్రధాన ఉద్దేశ్యం డీఎస్ఆర్ రియల్ ఎస్టేట్ గ్రూప్ చేపట్టిన ప్రాజెక్టులలో జరిగిన భారీ నగదు లావాదేవీలను, అక్రమ ఆస్తులు. డీఎస్ఆర్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్, డీఎస్ఆర్ బిల్డర్స్, డెవలపర్స్, డీఎస్ఆర్ ప్రైమ్ స్పేస్ వంటి అనుబంధ సంస్థలపైనా ఏకకాలంలో దాడులు జరిగాయి.
ఈ సోదాల్లో అధికారులు పెద్ద మొత్తంలో కీలక పత్రాలు, అక్రమ నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా, కంపెనీ అధినేతల పేరిట ఉన్న పలు బ్యాంకు లాకర్లను గుర్తించారు. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి డీఎస్ఆర్ గ్రూప్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో ఒక పార్టనర్‌గా వ్యవహరిస్తున్నట్లు ఐటీ శాఖ గుర్తించినట్లు తెలుస్తోంది. డీఎస్ఆర్ గ్రూప్‌లోని వివిధ ఇన్‌ఫ్రా సంస్థలతో పాటు అనేక ఇతర కంపెనీలతో ఆయనకు ఉన్న సంబంధాలపై అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి (AP Liquor Scam) సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ కన్‌స్ట్రక్షన్స్, శ్రీనివాస్ ఇన్‌ఫ్రా సంస్థల కార్యాలయాల్లోనూ ఐటీ సోదాలు జరిగాయి. ఈ కంపెనీల ఆర్థిక లావాదేవీలపై కూడా ఐటీ శాఖ దృష్టి సారించింది. ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడైన తర్వాత, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ, ఆర్థిక వర్గాల్లో మరిన్ని సంచలనాలు వెలువడే అవకాశం ఉంది. ఈ సోదాల వెనుక రాజకీయ ప్రతీకారం ఉందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ దాడులు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి.


