Water supply bandh in Hyderabad: హైదరాబాద్ వాసులకు జలమండలి బిగ్ అలర్ట్ జారీ చేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో సుమారు 18 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీఫాం రోడ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు తెలిపారు.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు: నల్లగుట్ట, ప్రకాశ్‌నగర్, మేకలమండి, బౌద్ధనగర్, శ్రీనివాస నగర్, పాటిగడ్డ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్ కానుందని జలమండలి పేర్కొంది. భోలక్‌పూర్, కవాడిగూడ, సీతాఫల్ మండి, హస్మత్‌పేట్, ఫిరోజ్‌గూడ, గౌతమ్‌నగర్ నీటి సరఫరకు అంతరాయం ఏర్పడనుందని అధికారులు తెలిపారు. సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్, మిలిటరీ ఇంజినీరింగ్ సరీ్వసెస్, బేగంపేట్ విమానాశ్రయం, బాలంరాయి పంప్‌హౌస్, బాలంరాయి చెక్‌పోస్ట్, బోయిన్‌పల్లి, రైల్వే కాలనీ పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం ఉండనుందని జలమండలి అధికారులు తెలిపారు. దీంతో వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు.


