47th All India Railway Kabaddi Championship for Women: సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంగణంలో 47వ ఆల్ ఇండియా రైల్వే కబడ్డీ (మహిళల) ఛాంపియన్‌షిప్ ప్రారంభమైంది. ఈ పోటీలను మంగళవారం దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్ ప్రారంభించారు.
- Advertisement -
రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ (ఆర్.ఎస్.పి.బి) ఆధ్వర్యంలో దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ ఈ ఛాంపియన్‌షిప్ నిర్వహిస్తోంది. నాలుగు రోజుల పాటు అనగా అక్టోబర్ 10వ తేదీ వరకు జరిగే ఈ పోటీలకు దక్షిణ మధ్య రైల్వే ఆతిథ్యం వహిస్తుంది.ఈ ఛాంపియన్‌షిప్‌లో సౌత్ ఈస్టర్న్ రైల్వే, ఈస్టర్న్ రైల్వే, వెస్ట్రన్ రైల్వే, సెంట్రల్ రైల్వే, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, నార్త్ ఈస్టర్న్ రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వేలకు సంబందించిన మొత్తం తొమ్మిది జట్లు పాల్గొంటున్నాయి. అంతర్జాతీయ, జాతీయ స్థాయి ఆటగాళ్ళు సైతం పాల్గొంటున్నారు. తొలిరోజు నాకౌట్ ప్రారంభ మ్యాచ్ దక్షిణ మధ్య రైల్వే , నార్త్ ఈస్టర్న్ రైల్వే మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో దక్షిణ మధ్య రైల్వే 48 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. నార్త్ ఈస్టర్న్ రైల్వే 25 పాయింట్లు సాధించింది.ఈ సందర్భంగా అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్ మాట్లాడుతూ, ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే జట్లకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఆటగాళ్లు నిజమైన క్రీడా స్ఫూర్తి, నిబద్దత ప్రదర్శించి ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు, ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ అరోమా సింగ్ ఠాకూర్, దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరి, ఫైనాన్షియల్ అడ్వైజర్ , చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పి. కోటేశ్వరరావు , ఇతర సీనియర్ రైల్వే అధికారులు, క్రీడా సిబ్బంది పాల్గొన్నారు.