ప్రముఖ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) అరెస్ట్ అయ్యారు. పోసాని కృష్ణమురళిని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని పోసాని కృష్ణమురళి నివాసానికి వెళ్లిన అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి పోసానిని ఏపీకి తరలిస్తున్నారు.
అనంతపురంలో పోసానిపై కేసు నమోదు అయింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో.. పోసాని టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై రాష్ట్రంలో పలుచోట్ల కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు పోసానిని రాయచోటి పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో నాయకులు అవినీతి, బెదిరింపులు, అసభ్యకర వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు వారిపై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అయితే అప్పుట్లో కేసులు నమోదు కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ఫిర్యాదులు అందిన నేపథ్యంలో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇలా ఇప్పటి వరకు నందిగం సురేష్, వల్లభనేని వంశీతో పాటు.. వైసీపీ సోషల్ మీడియా నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా పోసానిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కక్ష సాధిస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.