Water Supply Disruption: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు (జనవరి 8,9) నీటి కష్టాలు తప్పవు. కృష్ణా ఫేజ్-3 ప్రధాన పైప్‌లైన్‌లో తలెత్తిన లీకేజీలకు అత్యవసర మరమ్మతులు, నిర్వహణ పనులు చేపట్టాలని హైదరాబాద్ జలమండలి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సుమారు 18 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. జనవరి 8 ఉదయం 10 గంటల నుంచి జనవరి 9 తెల్లవారుజాము 4 గంటల వరకు ఈ అంతరాయం కొనసాగుతుందని జలమండలి అధికారులు పేర్కొన్నారు.
ప్రభావితమయ్యే ప్రాంతాలు: పైప్‌లైన్ మరమ్మతుల కారణంగా పశ్చిమ హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాలకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది. ఐటీ కారిడార్‌లో భాగంగా ఉన్న మాధాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, ఐఎస్‌బీ ప్రాంతం, మలేసియన్ టౌన్‌షిప్ ప్రాంతాలతో పాటుగా కేపీహెచ్‌బీ, బాలాజీనగర్, కుకట్‌పల్లి, మూసాపేట్, భారత్‌నగర్, గాయత్రినగర్, బాలానగర్, ఫతేనగర్. మియాపూర్, చందానగర్, హఫీజ్‌పేట్, ప్రగతినగర్, మయూరినగర్, గోపాల్‌నగర్, మైటాస్, బీహెచ్ఈఎల్, రైల్‌విహార్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏరియాల్లో నీటి సరఫరా నిలపివేస్తున్నట్లుగా నగర జలమండలి అధికారులు తెలిపారు.
Also read-Book reading : పార్కుల్లో పుస్తక పఠనం.. భాగ్యనగరంలో కొత్త ట్రెండ్!
జలమండలి సూచనలు: ఫేజ్-3 పైప్‌లైన్ ద్వారా ప్రతిరోజూ లక్షల లీటర్ల నీరు నగరానికి సరఫరా అవుతుంది. పైప్‌లైన్‌లోని జాయింట్లు, వాల్వులు మరియు పంపింగ్ స్టేషన్లలో తలెత్తిన చిన్నపాటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు గుర్తించారు. అందుకే ముందస్తు జాగ్రత్తగా ఈ మెయింటెనెన్స్ పనులు చేపడుతున్నారు. దీంతో నగరప్రజలు తమకు అవసరమైన నీటిని ఒక రోజు ముందుగానే నిల్వ చేసుకోవాలని సూచించారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని, వృథా చేయవద్దని అధికారులు కోరారు. అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల వారు అవసరమైతే ట్యాంకర్లను ముందుగానే బుక్ చేసుకోవడం శ్రేయస్కరమని తెలిపారు.

