Alert for Sankranti travelers : సంక్రాంతి పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (National Highway-65) కిక్కిరిసిపోతోంది. అయితే గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. ట్రాఫిక్ చిక్కుల నుంచి తప్పించుకోవడానికి ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
గంట ప్రయాణానికి 4 గంటల సమయం!: సాధారణ రోజుల్లో దిల్‍సుఖ్‌నగర్ నుండి చౌటుప్పల్‌కు గంటలో చేరుకోవచ్చు. కానీ గత ఏడాది భోగి ముందు రోజు విపరీతమైన రద్దీ కారణంగా ఇదే దూరాన్ని దాటడానికి ప్రయాణికులకు 3 నుంచి 4 గంటల సమయం పట్టింది. ప్రస్తుతం చౌటుప్పల్ వద్ద అండర్‌పాస్ వంతెన, సర్వీసు రోడ్డు పనులు జరుగుతుండటం వల్ల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.
మీ సొంతూళ్లకు వెళ్లడానికి సులువైన మార్గాలు ఇవే:
- హైదరాబాద్ నుండి గుంటూరు, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులు హయత్‌నగర్, చౌటుప్పల్, పంతంగి టోల్‌గేట్ వద్ద రద్దీలో చిక్కుకునే ప్రమాదం ఉంది. దీనికి బదులుగా హైదరాబాద్-నాగార్జునసాగర్ హైవే మీదుగా వెళ్లడం ఉత్తమమని పోలీసులు తెలిపారు. ఓఆర్‌ఆర్ (ORR) పై వచ్చేవారు బొంగుళూరు ఎగ్జిట్ తీసుకొని సాగర్ రోడ్డు వైపు వెళ్లవచ్చు.
- విజయవాడ, ఖమ్మం వైపు వెళ్లే వారు ప్రధాన హైవేపై రద్దీ ఎక్కువగా ఉంటే.. ప్రయాణికులు భువనగిరి – రామన్నపేట – చిట్యాల మార్గాన్ని ఎంచుకోవచ్చు. చిట్యాల దాటితే నార్కట్‌పల్లి నుండి ప్రయాణం సాఫీగా సాగుతుంది.
- భువనగిరి వైపు వెళ్లే వారు సికింద్రాబాద్, ఉప్పల్ మీదుగా కాకుండా.. ఓఆర్‌ఆర్‌పై వెళ్లి ఘట్‌కేసర్ ఎగ్జిట్ ద్వారా వరంగల్ హైవేలోకి ప్రవేశించి నేరుగా భువనగిరికి చేరుకోవచ్చు.
ఆదివారం ప్రయాణికులు జాగ్రత్త: ప్రతి ఆదివారం చౌటుప్పల్‌లో స్థానిక సంత జరుగుతుంది. దీనివల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. పండుగ రద్దీకి తోడు సంత కూడా ఉండటంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపడం శ్రేయస్కరం. అయితే ఈ మార్గంలో శుక్రవారం నుండే వాహనాల సందడి పెరిగింది. దీంతో రద్దీని క్రమబద్ధీకరించడానికి చౌటుప్పల్ పట్టణంలోని నారాయణపురం రోడ్డును పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా టోల్‌ప్లాజాల వద్ద అదనపు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

