AMB Cinemas & ODEON Multiplex: హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో మరో రెండు కొత్త మల్టీపెక్స్‌లు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇందులో ఒకటి మహేశ్‌బాబుది కాగా, మరొకటి ఓడియన్ మల్టీప్లెక్స్.. అత్యుత్తమ వీక్షణ అనుభూతితో ఈ మల్టీపెక్స్ స్క్రీన్లను రూపుదిద్దుతున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
స్టార్ హీరోల సినిమా రిలీజ్ అంటే మొదటగా గుర్తొచ్చేది హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు.. భారీ ఎత్తున కటౌట్లు, అభిమానుల కోలాహలం, థియేటర్లలో హీరోల సందడి, ప్రేక్షకుల రద్దీతో అక్కడి వాతావరణం అంతా పండుగను తలపిస్తుంది. పక్కా మాస్ హడావుడి ఉండే ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఇప్పుడు అధునాతన మల్టీప్లెక్స్‌లతో కొత్త కళ రాబోతుంది.
Also Read: https://teluguprabha.net/gallery/ac-health-tips-ans-ac-side-effects/
ఏఎంబీ సినిమాస్
ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్‌తో కలిసి సూపర్ స్టార్ మహేశ్ బాబు ఏఎంబీ సినిమాస్ అనే మల్టీప్లెక్స్‌ను నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ఫ్రాంచైజీని మరింత ముందుకుతీసుకువెళుతూ.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఏఎంబీ సినిమాస్‌ని మహేశ్ ఏర్పాటు చేయబోతున్నారు. క్రాస్ రోడ్స్‌లోని ఓడియన్ మాల్‌కి ఎదురుగా రాబోతున్న ఈ మల్టీప్లెక్స్ పనులు ప్రస్తుతం చివరిదశకు చేరుకున్నాయి.
వచ్చే ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ అనే సినిమాతో ఏఎంబీ మల్టీప్లెక్స్ లాంచ్ కాబోతుందని ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి సమాచారం. మొత్తం 7 స్క్రీన్లతో అత్యుత్తమ వీక్షణ అందించేలా ఏఎంబీ సినిమాస్ రూపుదిద్దుకుంటోంది. అత్యాధునిక ప్రొజెక్షన్ టెక్నాలజీ, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, సౌకర్యవంతమైన ప్రీమియం సీటింగ్‌తో గచ్చిబౌలి ఏఎంబీని మించిన స్థాయిలో దీనిని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.
ఓడియన్ మల్టీప్లెక్స్
ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఓ వైపు ఏఎంబీ సినిమాస్ రాబోతుండగా.. ఈ మల్టీప్లెక్స్ ఎదురుగానే ఓడియన్ మాల్ మల్టీప్లెక్స్‌గా రూపాంతరం చెందుతోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మాస్ థియేటర్‌గా ఒకప్పుడు పేరు తెచ్చుకున్న ఓడియన్ థియేటర్.. 2006లో బాంబ్ బ్లాస్ట్ అనంతరం మూతపడింది. అనంతరం నిర్వాహకులు ఆ థియేటర్‌ను కూల్చేసి మాల్‌ని నిర్మించారు. ఇప్పుడు తాజాగా ఇందులో మల్టీప్లెక్స్‌ను నిర్మిస్తున్నారు. అక్టోబర్ చివరి వారం లేదా డిసెంబర్‌లో ఓడియన్ మల్టీప్లెక్స్ ప్రారంభం కాబోతుందని అంచనా. మొత్తం 8 స్క్రీన్లతో మల్టీప్లెక్స్ రూపుదిద్దుకుంటోంది.


