ACB Raids In Hyderabad: హైదరాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. విద్యుత్ శాఖలోని కొందరు ఉన్నతాధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ ఈ చర్యలు తీసుకుంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఏకకాలంలో హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాల్లోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు.
మణికొండలో ఏసీబీ సోదాలు: హైదరాబాద్‌లోని మణికొండలో అడిషనల్ డివిజనల్ ఇంజినీర్ (ఏడీఈ)గా పనిచేస్తున్న అంబేద్కర్ నివాసంలో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఏడీఈ కార్యాలయంతో పాటుగా అతని బంధువుల ఇళ్లలో సైతం ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. అక్రమంగా వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు అంబేద్కర్ పై గతంలోనే వచ్చాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
బినామీల పేర్లతో ఆస్తులు: అంబేద్కర్ తన అక్రమాస్తులను బంధువుల పేర్లతో నమోదు చేసినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా వ్యవసాయ భూములు, స్థలాలు, భవనాలు పెద్ద ఎత్తున ఉన్నట్లు కనుగొన్నారు. హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లోనూ అతనికి ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం.. అధికారులు అతని అవినీతి ఆస్తుల పూర్తి వివరాలను లెక్కించే పనిలో ఉన్నారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 18 బృందాలు పాల్గొన్నాయి. అయితే అవినీతి నిరోధక శాఖ చేపట్టిన సోదాల పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


