Bhatti Vikramarka about Hyderabad Development: హైదరాబాద్ అభివృద్ధికి ఏటా రూ. 10వేల కోట్లు కేటాయిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అన్ని వైపులా హైదరాబాద్ అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని అన్నారు. నరెడ్కో ఆధ్వర్యంలో హైటెక్స్‌లో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోను మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి.. రాష్ట్ర వనరులు, అవకాశాలపై ప్రచారం నిర్వహించాల్సిన బాధ్యత నరెడ్కోపై ఉందని అన్నారు. కాగా, మూడు రోజుల పాటు ఈ ప్రాపర్టీ షో కొనసాగనుంది.
గత రెండేళ్లలో హైదరాబాద్ అభివృద్ధి కోసం రూ. 20 వేల కోట్లు ఖర్చు చేసినట్లు భట్టి తెలిపారు. హైడ్రాతో కొంత భయపడినా ఫలితాలు కనిపిస్తున్నాయన్న ఆయన.. ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలను, చెరువులను హైడ్రా కాపాడుతోందని స్పష్టం చేశారు.
Also Read: https://teluguprabha.net/business/maruti-suzuki-top-sale-cars-in-india/
రీజనల్ రింగ్ రోడ్డుతో నగర ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాం. మూసీ నది సుందరీకరణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రాయదుర్గంలో ఎకరా రూ. 177 కోట్లు పలకడం.. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం పడిపోతుందని ప్రచారం చేసే వారికి సమాధానం. నగరం నలువైపులా మెట్రోను విస్తరిస్తున్నాం. నరెడ్కో ప్రతినిధులు విల్లాలు, హైరైజ్ బిల్డింగులకే పరిమితం కాకుండా.. సీఎస్‌ఆర్ నిధులను విద్య, వైద్య రంగంపై ఖర్చు చేయాలి. మధ్య తరగతి, దిగువ తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాలు చేయండి. అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
Also Read: https://teluguprabha.net/national-news/post-office-national-savings-certificate-double-profit/
హైదరాబాద్‌లో పర్యావరణ పరిరక్షణ కోసం భవిష్యత్తులో అన్నీ ఎలక్ట్రిక్ బస్సులనే నడిపేలా చర్యలు తీసుకుంటున్నామని భట్టి తెలిపారు. వీటికి పన్ను మినహాయింపు సైతం ఇచ్చినట్లు పేర్కొన్నారు. నగరంలో మురుగునీటిని శుద్ధి చేసేందుకు రూ. 4వేల కోట్లతో ఎస్టీపీలను నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో 100 స్కూళ్లను నిర్మించబోతున్నట్లు చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మాణంలో ఉన్నాయని.. త్వరలోనే ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు భట్టి వివరించారు.


