బర్డ్ ఫ్లూ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను భయపెడుతోంది. ఈ వైరస్ కోళ్లకు సోకడంతో పెద్ద ఎత్తున అవి మృత్యువాత పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణలో కూడా ఈ వైరస్ భయం ప్రజల్లో ఉంది. ప్రభుత్వం కూడా బర్డ్ ఫ్లూ అధికంగా ఉన్న నేపథ్యంలో కొన్ని రోజులు ప్రజలు చికెన్‌కు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో జనాలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు.
ఇదిలా ఉంటే ప్రజల్లో బర్డ్ ఫ్లూ భయాల కారణంగా.. చికెన్ ధరలు భారీగా పడిపోతున్నాయి. అయినా చికెన్ అమ్మకాలపై బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ భారీగా పడింది. బర్డ్ ఫ్లూపై సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో సగంకి పైగా చికెన్ అమ్మకాలు తగ్గాయి. భాగ్యనగరంలో నిత్యం దాదాపుగా 6 లక్షల కిలోల చికెన్ సేల్ అవుతుంది.. అయితే గత రెండు మూడు రోజులుగా 50 శాతం కూడా సేల్స్ జరగట్లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు నిత్యం రద్దీగా ఉండే చికెన్ దుకాణాలు.. ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దానికి తోడు రోజూ నగరంలో అక్కడక్కడ కుళ్లిన చికెన్ నిల్వలు బయటపడుతున్నాయి. దాంతో చికెన్ ముట్టుకోవడానికి నగర వాసులు జంకుతున్నారు. హోటల్స్, రెస్టారెంట్లలో కూడా చికెన్ మెనూ ఆర్డర్లు పూర్తిగా తగ్గిపోయాయి. బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలు చికెన్‌కు బదులుగా.. మటన్, చేపల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో మటన్, చేపలకు భారీగా గిరాకీ పెరిగింది. హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా చికెన్ అమ్మకాలు తగ్గాయి. ఇటు ఏపీలో కూడా చికెన్ ముట్టుకోడానికే జనం జంకుతున్నారు.