Shamshabad Airport Bomb Mail: దేశంలో గత కొంతకాలంగా ఫేక్‌కాల్స్ మెయిల్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. జన సమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాలైన ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్‌లో బాంబులు పెట్టామని దుండగులు కాల్ చేసి బెదిరించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఆదివారం బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బాంబు ఉందంటూ గుర్తు తెలియని దుండగులు ఇ- మెయిల్ పంపించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సిబ్బంది విమానాశ్రయంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులను అప్రమత్తం చేశారు. అనంతరం అధికారులు ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విమానాశ్రయంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.
బాంబు బెదిరింపు విషయంలో ప్రయాణికులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు. కాగా, ఇటీవల ఢిల్లీలోని పలు పాఠశాలలకు కూడా దుండగులు బెదిరింపు కాల్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ సిబ్బంది అలర్ట్ అయింది. జన సామర్థ్యం ఉండే ప్రదేశాల్లో అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఫేక్‌కాల్స్, మెయిల్స్ విషయంలో అధికారులు ఎప్పటికపుడు అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ అధికారులు సూచిస్తున్నారు.


