Certificate Award to the Students of Begumpet Womans College: బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో వివిధ స్వల్ప కాలిక కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికేట్ల పంపిణీ అట్టహాసంగా జరిగింది. స్వప్నిక రేహా ఫౌండేషన్, జన విజ్ఞాన వేదిక, కార్యా ఫౌండేషన్ వారి సౌజన్యంతో జూవాలాజి డిపార్ట్మెంట్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 15 రోజుల వ్యవధి గల కొత్త కోర్సును ఇటీవల ప్రవేశపెట్టారు. పర్యావరణ పరిరక్షణ – సుస్థిరత (ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ – సస్టైనబిలిటీ) అనే అంశంపై 15 రోజుల (రోజుకు 2 గంటలు చొప్పున)పాటు ఈ సర్టిఫికెట్ కోర్సును నిర్వహించారు.
కాగా, దేశీయ, అంతర్జాతీయ నిపుణులతో ఈ తరగతులు నిర్వహించారు. అక్టోబర్ 7న ప్రారంభమైన ఈ కోర్సు 27వ తేదీతో పూర్తయ్యింది. కోర్సులో భాగంగా అక్టోబర్ 24, 27వ తేదీల్లో “ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ – పిల్లల బాధ్యత – క్షేత్ర స్థాయి ప్రాజెక్టులు” అనే అంశానికి సంబంధించిన వివిధ విషయాలపై విద్యార్థులు వారి ప్రాజెక్ట్‌లపై అద్భుతమైన ప్రజెంటేషన్లు ఇచ్చారు.
పర్యావరణ పరిరక్షణకు పాటుపడతాం.
కాగా, విద్యార్థుల ప్రజెంటేషన్లను అంతర్జాతీయ నిపుణులు సురక్ష (యూఎస్ఏ) సంస్థ ఆద్యులు శ్రీ ప్రసాద్ జాలాది, రిటైర్డ్ ఏపీ కాలుష్య మండలి సభ్య కార్యదర్శి డాక్టర్ పి. నారాయణ రావు , అడ్వకేట్ & స్వప్నిక రేహా ఫౌండేషన్ అధ్యక్షురాలు శ్రీమతి టి మహాలక్ష్మి, విశ్రాంత చీఫ్ ఇంజనీర్ (పబ్లిక్ హెల్త్), జన విజ్ఞాన వేదిక హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు జి. కొండలరావు, కార్యా ఫౌండేషన్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ శ్రీ ఎన్ హరనాథ్ బాబు, ఎస్‌ఎంఈ సంస్థ సభ్యులు సీహెచ్ రంగా రెడ్డి తదితరులు సమీక్షించి విద్యార్థులకు అవార్డులు, సర్టిఫికెట్లను బహుకరించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె పద్మావతి, జూవాలజి డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ జి.ఎస్. జ్యోతిర్మయి, హెల్త్ క్లబ్ కన్వీనర్ డాక్టర్ పి.ఎస్. రజనీ, ఫ్యాకల్టీలు డాక్టర్ డి ప్రసన్న, అంకిత, తనిష్క తదితరులు పాల్గొని ప్రసంగించి విద్యార్థులను ఉత్తేజపరిచారు. విద్యార్థులందరూ పర్యావరణ పరిరక్షణ సుస్థిరాభివృద్ధి అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి తాము కూడా శాయశక్తులా కృషి చేసి పర్యావరణాన్ని, భావి తరాల భవిష్యత్తును, దేశాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.




