Chain Snatching in Uppal CCTV Footage: వరుసగా పెరుగుతున్న బంగారం ధరలతో చైన్ స్నాచర్లు విజృంభిస్తున్నారు. రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళలను, ఇంట్లో ఉంటున్న వృద్ధులను లక్ష్యంగా చేసుకుని బంగారం దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఏమరపాటులోనే వారి మెడలో నుంచి గొలుసును తస్కరించి పరారవుతున్నారు. స్థానికుల చేతికి చిక్కితే చోరులకు దేహ శుద్ధే.. లేదంటే వాడు ఇక లక్షాధికారి. తాజాగా హైదరాబాద్‌లో మిట్ట మధ్యాహ్నం ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
మేడ్చల్ జిల్లా ఉప్పల్ పరిధిలో మిట్ట మధ్యాహ్నం రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న వృద్ధురాలి మెడలో నుంచి గొలుసు దొంగతనం ఘటన కలకలం రేపింది. ఉప్పల్ సెవెన్ హిల్స్ కాలనీలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి 4 తులాల బంగారు గొలుసు లాక్కొని పారిపోవడానికి దొంగ ప్రయత్నించాడు. వెంటనే మహిళ గట్టిగా కేకలు వేయడంతో.. కేకలు విన్న స్థానికులు దొంగను వెంబడించి పట్టుకున్నారు. నిందితుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చైన్ స్నాచర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/jayasurya-escaped-from-kurnool-bus-accident/
ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్నప్పుడు మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మెడ చుట్టూ దుపట్టా కప్పుకోవాలని చెబుతున్నారు.


