తొలి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించటం ఎలా అనే ఆసక్తికరమైన సెమినార్ కొంపల్లిలోని సెయింట్ మార్టిన్ ఇంజినీరింగ్ కాలేజ్ లో ఉత్సాహంగా జరిగింది. వింగ్స్ మీడియా, జీ 5, తెలుగుప్రభ మీడియా పార్ట్నర్స్ గా వ్యవహరించిన ఈ సెమినార్ లో సివిల్స్ పై తమకున్న పలు అనుమానాలను విద్యార్థులు నిపుణులను అడిగి తెలుసుకున్నారు.
ఆకట్టుకున్న దబాంగ్ ఆఫీసర్ కథ
21st సెంచురీ ఆధ్వర్యంలో సాగిన ఈ సెమినార్ లో ఛైర్మన్ పీ కృష్ణ ప్రదీప్ అమిత్ కటారియా అనే ఐఏఎస్ ఆఫీసర్ జీవితాన్ని కేస్ స్టడీగా వివరించారు. దబాంగ్ ఆఫీసర్ గా పాపులర్ అయిన అమిత్ తన జీతం నుంచి కేవలం ఒక్క రూపాయిని మాత్రమే తీసుకుంటూ ప్రజా సేవ చేసిన తీరును చెప్పుకొచ్చారు ప్రదీప్. ఆఖరుకి తన కుటుంబ అవసరాల కోసం తన భార్య జీతాన్నే ఉపయోగించి నిస్వార్థంగా చేసిన సేవలు అమిత్ కు మంచి పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయంటూ అకాడమీ డైరెక్టర్ ఇంజినీరింగ్ విద్యార్థులకు వివరించారు.
ఐఐటీలు ఐఐఎంలే కాదు
కేవలం ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలు, ఐఐఎంలకు చెందిన విద్యార్థులే సివిల్స్ లో విజయం సాధించగలరన్నది ఒట్టి భ్రమే అంటూ 21st సెంచురీ చీఫ్ మెంటార్ డాక్టర్ భవానీ శంకర్ విద్యార్థులకు వివరంగా చెప్పిన తీరు వారిని ఆలోచింపచేసింది. గ్రాడ్యుయేట్లు ఎవరైనా సివిల్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాగలరంటూ ఆయన వివరించారు. కెరీర్ అవకాశంగా మాత్రమే కాకుండా సమాజంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సాధించేందుకు సివిల్స్ ను లక్ష్యంగా పెట్టుకోవాలంటూ భవానీ శంకర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సెయింట్ మార్టిన్ ఇంజినీరింగ్ విద్యార్థులు ఆల్ ఇండియా సర్వీసుల్లో విజయం సాధించేలా పట్టుదలతో కృషి చేయాలంటూ సెయింట్ మార్టిన్ కాలేజ్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ సంతోష్ కుమార్ పాత్ర అన్నారు.