CM Revanth Reddy at Jubilee Hills Campaign: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో 30 వేల మెజార్టీతో గెలవబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లో 4 వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. నవీన్ యాదవ్‌కు మద్దతుగా రహమత్ నగర్ డివిజన్‌లో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎస్‌పీఆర్ హిల్స్ నుంచి హబీబ్ ఫాతిమా నగర్ వరకు రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
బీఆర్‌ఎస్ హయాంలో ఒక్కరికైనా రేషన్‌కార్డులు ఇచ్చారా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రెండేళ్ల పాలనలో జూబ్లీహిల్స్‌లో 14,159 రేషన్ కార్డులు అందించామన్నారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ గెలిస్తే మీకు వచ్చే పథకాలు కూడా ఆగిపోతాయనన్నారు. అధిష్ఠానం ఆదేశాల మేరకే అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చామని స్పష్టం చేశారు.
‘మన ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. బీఆర్‌ఎస్‌కు మహిళా సెంటిమెంట్‌తో ఓటేస్తే మళ్లీ మోసపోతాం. కేటీఆర్ వేల కోట్ల ఆస్తులు సంపాదించి చెల్లెలు కవితకు పావులా కూడ ఇవ్వలేదు. కేసీఆర్‌కు బీజేపీ కూడా సపోర్ట్ చేస్తోంది. అందుకే కాళేశ్వరం దొంగలపై మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. కేసీఆర్‌ను బీజేపీ ఎందుకు కాపాడుతోంది. కారు ఢిల్లీ చేరగానే కమలంగా మారిపోతుంది.’ అని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కూడా సిద్ధమైందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో కేసీఆర్, కేటీఆర్‌ను జైలుకు పంపిస్తామని చెప్పారు. కానీ 3 నెలలైనా స్పందన లేదని ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లది ఫెవికాల్ బంధం కాకపోతే ఈ నెల 11 లోగా సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సవాల్ విసిరారు. ఫార్ములా ఈ కారు కేసులో కేటీఆర్‌ను అరెస్టు చేసేందుకు గవర్నర్ పర్మిషన్ కోరితే ఇవ్వడం లేదని రేవంత్ వ్యాఖ్యానించారు.


