Heavy Rains in Hyderabad: హైదరాబాద్‌ను వరుణుడు బెంబేలెత్తించాడు. కారుమేఘాలు కమ్ముకుని ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో నగరం అతలాకుతలం అయ్యింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఉరుములు మెరుపులతో మొదలైన మేఘగర్జన రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో వరద ఉధృతికి వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. పలు చోట్ల ఓపెన్ నాలాలు, మ్యాన్‌హోల్స్ పొంగిపోర్లాయి. దీంతో రోడ్లన్నీ చెరువులను తలపించడంతో ట్రాఫిక్ పూర్తిగా అస్తవ్యస్తమైంది.
అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక: విజయవాడ, వరంగల్, ముంబై, బెంగళూరు, కరీంనగర్ వెళ్లే మార్గాల్లో ఇళ్లకు, ఆఫీసులకు బయలుదేరిన వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రధానంగా అసెంబ్లీ నుంచి ఖైరతాబాద్, మెహిదీపట్నం నుంచి మాసాబ్ ట్యాంక్, ఎల్బీ నగర్ నుంచి మలక్‌పేట వరకు కేవలం కిలోమీటర్ ప్రయాణానికి చాల సమయం పట్టింది. రాత్రి అత్యధికంగా బంజారాహిల్స్‌లో సుమారు 10.5 సెం.మీ. వర్షం కురవగా శ్రీనగర్ కాలనీలో 9.9 సెం.మీ., ఖైరతాబాద్‌లో 8.9 సెం.మీ. వర్షం కురిసిందని వాతావరణ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
సీఎం కాన్వాయ్‌కూ తప్పని ట్రాఫిక్ తిప్పలు: హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో సాధారణ ప్రజలతో పాటుగా సీఎంకు కూడా ట్రాఫిక్ తిప్పలు తప్పలేదు. సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్ సైతం ట్రాఫిక్‌లో చిక్కుకొని నెమ్మదిగా ముందుకు సాగింది. సోమవారం సాయంత్రం సీఎం సచివాలయం నుంచి జూబ్లీహిల్స్‌లోని తన ఇంటికి బయల్దేరగా ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా వీవీ స్టాచ్యూ వద్దకు రాగానే.. ఖైరతాబాద్ కూడలిలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వాస్తవానికి సచివాలయం నుంచి సీఎం నేరుగా తన ఇంటికి వెళ్లేందుకు 13 నిమిషాల సమయం పడుతుంది. కానీ కుండపోత వర్షంతో గంటల కొద్ది సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్ ట్రాఫిక్‌లోనే ఉండి పోయింది.
హైదరాబాద్ ప్రజలకు సూచన: వాతావరణం అకస్మాత్తుగా మారే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పగటిపూట వర్షాలు పడే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ.. సాయంత్రం తర్వాత వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకోకుండా ఉండేందుకు సాయంత్రం లోపు ఇళ్లకు చేరుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


