CM Revanth Reddy Press meet: 2004- 14 వరకు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని.. ఆ సమయంలోనే హైదరాబాద్ అభివృద్ధి వేగంగా జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2014-24 మధ్య ప్రధాని మోదీ మోదీ, అప్పటి సీఎం కేసీఆర్ కలిసి హైదరాబాద్‌కు చేసిందేమిటని సీఎం ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్‌ఎస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/cm-revanth-reddy-photo-with-57kgs-rice-for-his-birthday/
రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌కు అప్పగించిందని.. కానీ 2024 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్ర అప్పులు రూ. 8.11 లక్షల కోట్లు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో కనిపిస్తున్న అభివృద్ధి అంతా 2014కు ముందు జరిగినదే అని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్‌గా మారిందని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఓటర్లు ఆలోచించి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
‘సచివాలయంలో ఉన్న దేవాలయం, మసీదు కూల్చేస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడలేదు. సచివాలయం, కమాండ్ కంట్రోల్ రూమ్, ప్రగతి భవన్, కాళేశ్వరం మాత్రమే బీఆర్ఎస్ హయంలో పూర్తయ్యాయి. రూ. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కేసీఆర్ హయాంలోనే కూలిపోయింది. ప్రగతి భవన్ కేసీఆర్ విలాసవంతమైన జీవితం గడిపేందుకు మాత్రమే ఉపయోగపడింది. కొడుకు భవిష్యత్తు, వాస్తు కోసమే రూ. 2 వేల కోట్లతో కేసీఆర్ కొత్త సచివాలయం కట్టారు.’ అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/cm-revanth-reddy-photo-with-57kgs-rice-for-his-birthday/
సచివాలయం నిర్మాణంతో నిరుద్యోగులకు ఏమైనా కొత్త ఉద్యోగాలు వచ్చాయా అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ప్రతిపక్షాలపై నిఘా పెట్టేందుకే కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మించారని ఆరోపించారు. పదేళ్లలో రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చేలా కేసీఆర్, కిషన్ రెడ్డి చేసింది ఏమిటో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రాజెక్టులను ప్రధాని మోదీ రద్దు చేశారని సీఎం రేవంత్ ఆరోపించారు.
‘వైఎస్‌ఆర్, జైపాల్ రెడ్డి కలిసి హైదరాబాద్‌కు మెట్రో తీసుకొచ్చారు. ఎల్‌అండ్‌టీని కేసీఆర్, కేటీఆర్ బ్లాక్ మెయిల్ చేశారు. కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్‌లా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ప్రగతిని అడ్డుకుంటున్న కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్. వీరిని హైదరాబాద్ నగర వాసులు ఇలాగే అనుకుంటున్నారు. ఈ బ్యాడ్ బ్రదర్స్ మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారు. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్డును అడ్డుకుంటోంది కూడా ఈ బ్యాడ్ బ్రదర్సే.’ అని సీఎం రేవంత్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
గడిచిన రెండేళ్లలో రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తెచ్చామని సీఎం రేవంత్ అన్నారు. ప్రజలకు ఉపయోగం లేని ప్రాజెక్టులు నిర్మించిన బీఆర్ఎస్ ఇప్పటికీ వాటిని చూపించి మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమేన్నారు. కేటీఆర్ రాష్ట్రానికి తీసుకొచ్చింది గంజాయి, డ్రగ్స్ మాత్రమే అని దుయ్యబట్టారు.
హైడ్రా, ఈగల్ ఫోర్స్ ద్వారా నగరంలో ప్రక్షాళన జరుగుతోందని ఉద్ఘాటించారు. ఇళ్ల కూల్చివేతలు బాధిత పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీలు ఇచ్చామని పేర్కొన్నారు. నగర అభివృద్ధికి బీఆర్‌ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డంకిగా మారారని ఆరోపించారు. ఈ మేరకు కేటీఆర్, కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ సవాల్ విసిరారు. గత పదేళ్లలో మీరు చేసిన అభివృద్ధి, తెచ్చిన ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. మంత్రి అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే ప్రతిపక్షాలకు ఎందుకు దుఃఖమని ప్రశ్నించారు.


