Hyderabad: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి CREDAI హైదరాబాద్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో ముఖ్య ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో ఆయన రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, పట్టణాభివృద్ధి, మరియు ప్రభుత్వ ప్రాధాన్యతలపై స్పష్టమైన విధానాన్ని వెల్లడించారు. అపోహలు, అనుమానాలను పక్కనపెట్టి రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం పాలసీ, నిర్మాణ రంగం రెండూ రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్స్ వంటివని ఆయన పేర్కొన్నారు.
పాలకులు మారినా పాలసీ పెరాలసిస్ లేకుండా చూడటం వల్లే మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నామని చెప్పారు. పారదర్శక పాలసీలతో పెట్టుబడులను ఆహ్వానిస్తూ, పెట్టుబడిదారులకు లాభాలు వచ్చేలా చూసే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. తాను సగటు మధ్యతరగతి ఆలోచనలు ఉన్న ముఖ్యమంత్రిని అని, సమాజ శ్రేయస్సు కోసమే ఆలోచిస్తానని అన్నారు.
జైపాల్ రెడ్డి చొరవతో హైదరాబాద్‌కు మెట్రో వచ్చిందని గుర్తుచేస్తూ, పదేళ్లుగా మెట్రో విస్తరణ జరగలేదని, దానివల్ల ట్రాఫిక్ సమస్యలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం షామీర్‌పేట్, మేడ్చల్ వరకు మెట్రో విస్తరణకు కృషి చేస్తున్నామని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి మెట్రో, మూసీ, ఇతర అనుమతులు తెచ్చుకోవడానికే తరచుగా ఢిల్లీ వెళ్తున్నానని, ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని వివరించారు. అలాగే, 11 కొత్త రేడియల్ రోడ్లు, డ్రై పోర్టు ఏర్పాటు, మరియు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను (కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్) విభజించి అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.
Read more: https://teluguprabha.net/telangana-district-news/hyderabad/chaitanyapuri-metro-seizure-notice/
తాను హైదరాబాద్‌ను భవిష్యత్తు తరాలకు గుర్తుండిపోయే గొప్ప నగరంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నానని, ఈ విషయంలో అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. చివరిగా, భూమి ఒక సెంటిమెంట్ అని, ఈ సెంటిమెంట్‌ను పాజిటివ్‌గా ముందుకు తీసుకెళ్తేనే రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ జైదీప్ రెడ్డి, జగన్నాథ రావు, జనరల్ సెక్రటరీ క్రాంతి కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.


