CM Revanth Reddy about KTR and KCR: ‘రాష్ట్రంలో అభివృద్ధి చేసేది మేమే.. అందుకే జూబ్లీహిల్స్‌లో ఓటు అడుగుతున్నాం.’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌లో ఒక్కొక్కరినీ ఎలిమినేట్ చేస్తూ వచ్చారు.. బీఆర్‌ఎస్‌ను కబళించేందుకు హరీశ్ రావు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించారు. కేటీఆర్ ఓ విషపురుగు అని దుయ్యబట్టారు. ఈ మేరకు మాజీ మంత్రి కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు.
కేటీఆర్ ఓ విష పురుగు, నగరానికి గంజాయి, డ్రగ్స్ తీసుకొచ్చారని సీఎం రేవంత్ ఆరోపించారు. నగరంలో అత్యాచారాలకు అవే కారణం కాదా అని మండిపడ్డారు. అందుకే రాష్ట్రంలో ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చి గంజాయి, డ్రగ్స్‌ను అరికడుతున్నామని స్పష్టం చేశారు.
‘పదే పదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను రౌడీ అంటున్నారు. దీపావళి రోజు డ్రగ్స్ వాడిన వాళ్లు రౌడీలు అవుతారు. నిత్యం ప్రజల్లో ఉండే వాళ్లు రౌడీలు అవుతారా. నగరాన్ని పరిరక్షించి అభివృద్ది చేసేందుకే హైడ్రాను తీసుకొచ్చాం. ఆక్రమణలపైనే హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. అక్కడక్కడ పేదలకు ఇబ్బంది వస్తే న్యాయం చేస్తున్నాం. హైడ్రా తీసుకొచ్చి ఆక్రమణల నుంచి పార్కులు, చెరువులను కాపాడుతున్నాం. వీళ్లు రాష్ట్రానికి ఏమీ చేయరు, వీళ్లకు రాజకీయాలే ముఖ్యం. అభివృద్ధి చేసేది మేమే, అందుకే ఓటు అడుగుతున్నాం.’ అని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/cm-revanth-reddy-photo-with-57kgs-rice-for-his-birthday/
వాళ్లు హీరోయిన్లతో ఎలా గడిపారో అందరికీ తెలుసంటూ బీఆర్‌ఎస్ నేతలనుద్దేశించి సీఎం రేవంత్ అన్నారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే వీళ్లకు కడుపుమంట ఎందుకని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌లో ఒక్కొక్కరిని రాజకీయంగా ఎలిమినేట్ చేస్తూ వచ్చారని ఆరోపించారు. పార్టీలోని కీలక నేతలను మాజీ మంత్రి హరీష్ రావు బయటకు పంపారని.. చివరకు కుటుంబసభ్యుల్లో కూడా కొందరిని బయటకు పంపారన్నారు. బీఆర్‌ఎస్‌ను కబళించేందుకు హరీష్ రావు కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు.
కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ జూబ్లీహిల్స్‌లో పార్టీ బహిరంగ సభకు అనుమతిపై రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ సమాధానమిచ్చారు. ఎన్నికల సందర్భంలో పార్టీ బహిరంగ సభలకు అనుమతి నిర్ణయం ప్రభుత్వంతో సంబంధం ఉండదని సీఎం రేవంత్ అన్నారు. అనుమతి ఇవ్వాలా వద్దా అనేది ఎన్నికల సంఘం చేతిలో ఉంటుందని స్పష్టం చేశారు. కానీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని.. బీజేపీకి డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు.


