September 17 Liberation Day: సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకూ విమోచనా దినోత్సమా లేక విలీన దినోత్సవమా అనే కాంట్రవర్సీ రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని.. అన్ని జిల్లా కేంద్రాల్లో ఇన్‌ఛార్జ్ మంత్రులు జాతీయ జెండా ఎగురవేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేయనున్నారు.
హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో బుధవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు పోలీసు అధికారులు నిర్వహించే రిహార్సల్స్, ఏర్పాట్లను డీజీపీ జితేందర్ పరిశీలించారు. ఆయనతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇక డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆయన సొంత జిల్లా ఖమ్మంలో జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. కాగా, మరోవైపు తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే ఈ వేడుకల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరై జెండా ఆవిష్కరించనున్నట్లు సమాచారం.
కంటోన్మెంట్ పార్కులో దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. పలువురు కీలక మంత్రులు, పార్టీ నాయకులు హాజరుకానున్నారు. కాగా గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించిన విషయం తెలిసిందే.
Also Read: https://teluguprabha.net/telangana-news/ktr-accuses-congress-of-corruption-in-telangana/
ఈ క్రమంలో బీజేపీ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు తీవ్ర విమర్శలు చేశారు. సెప్టెంబర్ 17 గురించి మాట్లాడే అర్హత బీజేపీకి ఏ మాత్రం లేదని దుయ్యబట్టారు. సెప్టెంబర్ 17 విమోచనం కాదు.. బరాబర్ విలీనమే అని స్పష్టం చేశారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందడం వారికి పరిపాటే అని విమర్శించారు.


