DCA Raids in Hyderabad Gyms: నిబంధనలకు విరుద్ధంగా జిమ్‌లలో స్టెరాయిడ్స్, ప్రాణాంతక ఇంజెక్షన్లు వినియోగించవద్దని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సూచించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని పలు జిమ్‌లలో తనిఖీలు నిర్వహించారు. గతంలో జిమ్‌కు వచ్చేవారికి కండలు పెరుగుతాయని యజమానులు అనబాలిక్-ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్, కార్డియాక్ అరెస్టులకు దారి తీసే మెఫెంటెర్మిన్ సల్ఫేట్‌ను జిమ్‌కు వచ్చే వారికి సూచిస్తున్నట్లు తెలిసింది. ఇవి ప్రాణాంతక ఇంజెక్షన్లని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మరోసారి అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఈ మేరకు నగరంలోని పలు జిమ్‌లలో అక్రమంగా నిల్వ చేసిన ప్రాణాంతక ఇంజెక్షన్ల కోసం అధికారులు సోదాలు చేపట్టారు. కండలు పెరగడం కోసం అనబాలిక్-ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్, మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు వంటివి ఉపయోగిస్తే గుండె సంబంధిత రుగ్మతలకు దారి తీస్తుందని చెప్పారు. కొన్నిసార్లు మరణానికి కూడా కారణం కావచ్చని.. ఎట్టి పరిస్థితుల్లోని కస్టమర్లకు వాటిని సూచించొద్దని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరించింది.
ఈ మేరకు ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా, స్థానిక పోలీసు అధికారులతో డీసీఏ సమన్వయం చేసుకుని నగరంలోని 20 జిమ్‌లలో అకస్మిక తనిఖీలు చేపట్టింది. సికింద్రాబాద్, మెహదీపట్నం, టోలీచౌకి, మలక్‌పేట, నార్సింగి, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొత్తపేట, కూకట్‌పల్లి, సూరారంలలోని జిమ్‌లలో తనిఖీలు నిర్వహించినట్లు డీసీఏ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసీం పేర్కొన్నారు.
సాధారణంగా గుండె సంబంధిత శస్త్ర చికిత్స చేసే సమయంలో అనస్థిషియా ఇవ్వడం వల్ల రోగులకు రక్తపోటు తగ్గుతుంది. ఆ సమయంలో బీపీని పెంచడానికి మెఫెంటెర్మైన్ సల్ఫేట్‌ను పేషెంట్లకు ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. అయితే ఈ ఔషధం ఎంత మోతాదులో ఉండాలనేది కేవలం వైద్యుడు మాత్రమే నిర్ణయిస్తారు. కానీ జిమ్ నిర్వాహకులు దీనిని దుర్వినియోగం చేస్తూ, కస్టమర్లకు సూచిస్తున్నారు. ఈ క్రమంలో జిమ్ నిర్వాహకులు ఇలాంటి మందులను నిల్వ చేయడం లేదా విక్రయించడం చట్టవిరుద్ధమని డీసీఏ పేర్కొంది. డ్రగ్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, 1940 ప్రకారం వీటిని దుర్వినియోగం చేస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు ఉంటాయి. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందని స్పష్టం చేశారు.


