హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దేశాన్ని గడగడలాడించిన ఈ కేసులో ఇప్పటికే NIA కోర్టు ఐదుగురు నిందితులకు విధించిన ఉరిశిక్షను హైకోర్టు కూడా సమర్థించింది. దోషులకు మరణశిక్ష ఖరారుగా ఉండటమే సముచితమని ధర్మాసనం స్పష్టం చేసింది.
యాసిన్ భత్కల్, తహసీన్ అక్తర్, అజాజ్, అసదుల్లా అక్తర్, జియా ఉర్ రెహమాన్ లకు ఉరిశిక్ష విధిస్తూ గతంలో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు ఈ రోజు పునరుద్ఘాటించింది. దోషుల అభ్యంతరాలను తిరస్కరిస్తూ, తమపై విధించిన శిక్షను సరైనదిగా పేర్కొంది.
2013 ఫిబ్రవరి 21న జరిగిన ఈ దాడిలో 18 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. టిఫిన్ బాక్సుల్లో పెట్టిన బాంబులతో ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థ సభ్యులుగా ఉన్న నిందితుల పైనా ఎన్‌ఐఏ వివరమైన దర్యాప్తు జరిపి, 157 మంది సాక్షులను విచారించి అభియోగాలపై ఆధారాలతో కూడిన ఛార్జ్‌షీట్‌ను కోర్టులో సమర్పించింది. తాజా తీర్పుతో బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.