Ktr Tummala Nageswara Rao Issue : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో డ్రగ్, గన్ కల్చర్ పెరగడానికి కేటీఆర్ ఏ మూల కారణమని సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఈ సమస్యలు మొదలైనట్టు తెలిపారు. “కేటీఆర్ నాయకత్వంలో యువతను తప్పుదారి పట్టించారు. ఇప్పుడు అది రాష్ట్రానికి భారంగా మారింది” అంటూ మండిపడ్డారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేసిన తుమ్మల, మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేస్తున్న ‘బాకీ కార్డు’ ప్రచారాన్ని తిప్పికొట్టారు. బీఆర్ఎల్ పాలనలో ఇచ్చిన హామీలు ఏమీ నెరవేరలేదని, రాష్ట్రంపై పెట్టిన లక్షల కోట్ల అప్పులు ఇప్పటికీ భారంగానే మిగిలిపోయాయని మండిపడ్డారు. “పదేళ్ల పాలనలో రైతులు, యువత, మహిళలలకు ఏమీ చేయలేదు. ఇప్పుడు మేం వచ్చాం, సంక్షేమం చేస్తాం” అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను తుమ్మల ప్రశంసించారు. గత రెండు సంవత్సరాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా జరుగుతున్నాయని అన్నారు. ఇందులో రైతు భరోసా, మహిళా శక్తి, యువసమాజం కార్యక్రమాలు ప్రధానమని తెలిపారు. ఉదాహరణకు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు పెన్షన్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటివి ప్రజలకు స్పష్టమైన ఫలితాలు ఇచ్చాయని, ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి ఇవే కారణాలని తుమ్మల స్పష్టం చేశారు.
కేటీఆర్ చేసిన మరో వ్యాఖ్యను కూడా తుమ్మల ఖండించారు. రేవంత్ పాలన కారణంగా పారిశ్రామికవేత్తలు రాష్ట్రం విడిచి వెళ్తున్నారని కేటీఆర్ అన్న మాటలకు కౌంటర్ ఇచ్చారు. ఈ విషయం నూటికి నూరు శాతం అవాస్తవమని స్పష్టం చేశారు. “రోజూ కొత్త పెట్టుబడులతో పారిశ్రామికవేత్తలు తెలంగాణకు వస్తున్నారు. ఫార్చూన్ 500 కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి” అని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో అప్పులు పెరిగి, పెట్టుబడులు తగ్గాయని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక స్థిరత్వం తీసుకువస్తోందని వివరించారు.
ఇటీవలి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు గుర్తుంచుకోవాలని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవలం 39 సీట్లకే పరిమితమైందని, ప్రజలు పదేళ్ల పాలనకు తగిన పాఠం చెప్పారనే విషయం బీఅర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలని తెలిపారు. అలాంటి పార్టీకి కాంగ్రెస్‌పై మాట్లాడే అర్హత లేదని తుమ్మల స్పష్టం చేశారు.


