Drugs Seized in Jeedimetla: హైదరాబాద్ నగరంలో వరుసగా మాదకద్రవ్యాల ముఠా గుట్టురట్టవుతోంది. నగరానికి రూ. కోట్ల విలువ చేసే డ్రగ్స్ సరఫరాతో యువత వీటికి ఎలా బానిస అవుతున్నారనేదానికి అద్దం పడుతోంది. ఇటీవల శంషాబాద్ విమానాశ్రయంలోనూ ఎయిర్‌పోర్టు అధికారులు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న వ్యక్తులను పట్టుకున్నారు. డ్రగ్స్ అక్రమ దందాపై ప్రభుత్వం, యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తున్నా.. వివిధ మార్గాల్లో నగరానికి సరఫరా కావడం ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా భాగ్యనగరంలో భారీ ఎత్తున డ్రగ్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. జీడిమెట్లలో ఏకంగా 220 కిలోల ఎఫిడ్రిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మాదకద్రవ్యాల విలువ అంతర్జాతీయంగా రూ. 72 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా దేశీయ మార్కెట్లో ఎఫిడ్రిన్ విలు రూ. 10 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
నగరంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఈ ఎఫిడ్రిన్ అనే డ్రగ్‌ను తయారుచేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశామని.. మరొకరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కాగా, ఈ డ్రగ్స్ తయారీలో ప్రధాన నిందితుడిగా శివరామకృష్ణ ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు.. ఎఫిడ్రిన్ తయారీకి వాడిన ఫార్ములాను సైతం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.


