Fake News Viral on HK Makeup and clinic: హైదరాబాద్‌లోని హెచ్‌కే పర్మనెంట్ మేకప్ క్లినిక్, హెచ్‌కే హాస్పిటల్స్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబర్లపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కేపీహెచ్‌బీ పరిధి హెచ్‌కే పర్మనెంట్ మేకప్ పేరుతో క్లినిక్, హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. ఈ క్లీనిక్‌పై కొంతమంది యూట్యూబర్లు పనిగట్టుకొని దుష్ప్రచారం చేశారు. దీంతో, జూన్‌లో కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో సంస్థ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పలువురు యూట్యూబర్లపై FIR నంబర్ 692/2025 నమోదు చేసి కేసు పెట్టారు. అనంతరం పోలీసులు జరిపిన దర్యాప్తులో హెచ్‌కే గ్రూప్ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కొందరు వ్యక్తులు ప్రణాళికాబద్ధంగా కుట్ర చేసినట్లు రుజువైంది. కాల్ రికార్డులు, ఆన్‌లైన్ కమ్యూనికేషన్ల రూపంలో దొరికిన డిజిటల్ సాక్ష్యాల ఆధారంగా ఈ కుట్రను పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు వెల్‌నెస్ ఆఫ్ విమెన్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మిస్ పూర్ణిమ పిన్నేటి (A1)పై కేసు నమోదు చేశారు. ఆమెకు సహకరించిన యూట్యూబర్లు శ్రీనివాస్ అలియాస్ శ్రీను 65, ఆనంద్ లవేటి (విజయవాడ), పవన్ కుమార్ అలియాస్ పవన్ రా టాక్స్, అరుణ్ గున్నా అలియాస్ జాంబీ రివోల్ట్, పవని మహేష్ అలియాస్ ఎంసీ టాక్స్, జర్నలిస్ట్ పట్రిషియా నాయుడుపై కూడా కేసు నమోదైంది. వీరంతా A1 పూర్ణిమ ఆదేశాల మేరకు హెచ్‌కే గ్రూప్, డైరెక్టర్లపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు.
కుట్ర పూరితంగానే ఫేక్ ప్రచారం..
కాగా, ఈ కేసుపై కేపీహెచ్‌బీ పోలీస్ ఎస్‌హెచ్‌ఓ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, “హెచ్‌కే గ్రూప్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరిగింది. కొంత మంది ఉద్దేశపూర్వకంగానే సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేసినట్లు రుజువైంది.” అని తెలిపారు. దర్యాప్తు అనంతరం పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సెక్షన్లు 351(2), 351(4), 352, 353(1), 61(2), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000లోని సెక్షన్లు 66(D), 67 కింద కేసు నమోదు చేశారు. కుట్ర, అపకీర్తి, డిజిటల్ మోసం, సోషల్ మీడియా దుర్వినియోగం కింద కేసు నమోదైంది. దీనికి తోడు, హైకోర్టులో హెచ్‌కే గ్రూప్ డైరెక్టర్ శ్రీమతి అజ్మీరా హర్షిత నాయక్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ నెం.15451/2025 పై విచారించన హైకోర్టు జూన్ 12న తీర్పు వెలువరించింది. హెచ్‌కే సంస్థపై యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో 100కు మించిన ఫేక్ వీడియోలను తొలగించాలని ఆదేశించింది. అదేవిధంగా, ఇలాంటి ఫేక్ కంటెంట్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ కాకుండా చూడాలని తెలంగాణ పోలీసులను ఆదేశించింది.హెచ్‌కే గ్రూప్‌ను అన్ని అనుమతులు పొందిన చట్టబద్ద సంస్థగా హైకోర్టు గుర్తించింది. ఈ సంస్థకు తెలంగాణ అలోపతి ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ (2022–2027), డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940 (2028 వరకు), ట్రేడ్‌మార్క్ యాక్ట్, 1999 కింద అన్ని అనుమతులు ఉన్నాయని ధృవీకరించింది.
సోషల్ మీడియా చట్టానికి అతీతం కాదు..
హైకోర్టు తీర్పుపై హెచ్‌కే గ్రూప్ హానరరీ అడ్వైజర్, మాజీ ప్రొఫెసర్ డాక్టర్ జి. నరసింహ రావు నేత హర్షం వ్యక్తం చేశారు. “హెచ్‌కే గ్రూప్ ఎథికల్ డెర్మటాలజీలో నూతన ప్రమాణాలను నెలకొల్పింది. మోర్ఫియస్ 8 తరహా ఆప్టిమస్, ఎవావ్వ్ వంటి ఆధునిక పద్ధతులను ఉపయోగించి చికిత్స చేస్తున్నాం. ఎఫ్‌డీఏ, సీడీఎస్‌సీఓ నుంచి ఆమోదం పొందిన కన్స్యూమబుల్స్‌నే అమెరికా, కొరియా నుండి చట్టబద్ధంగా దిగుమతి చేసుకుంటున్నాము” అని స్పష్టం చేశారు. డైరెక్టర్ శ్రీమతి అజ్మీరా హర్షిత నాయక్ మాట్లాడుతూ, “మా ప్రతిష్ఠను దెబ్బతీయడానికి పన్నిన కుట్రను న్యాయ వ్యవస్థ తిప్పికొట్టింది. మా క్లయింట్లు, సిబ్బంది, లీగల్ టీం, పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము” అని పేర్కొన్నారు. డైరెక్టర్ శ్రీ కార్తీక్ మాట్లాడుతూ, “హైకోర్టు తీర్పు మాకు మరింత బలాన్నిచ్చింది. మేము ప్రపంచ స్థాయి వైద్య సేవలకు కట్టుబడి ఉన్నాం.” అని తెలిపారు. అడ్వకేట్ నాగూర్ బాబు, హెచ్‌కే గ్రూప్ తరఫున వాదిస్తూ, “ఇది హెచ్‌కే గ్రూప్‌కే కాదు, సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతీ చట్టబద్ధ సంస్థకు ఒక దిశా నిర్దేశమైన తీర్పు. సోషల్ మీడియా సైతం చట్టానికి అతీతం కాదని హైకోర్టు ఈ తీర్పుతో బలంగా తెలియజేసింది. నిజం ఎప్పటికీ గెలుస్తుంది.” అన్నారు.


