హైదరాబాద్ నగరానికి చెందిన ఒక మహిళకు తొమ్మిది గంటల పాటు సుదీర్ఘంగా కీహోల్ శస్త్రచికిత్స చేసి, రెండువైపులా మూత్రనాళాలను మార్చిన ప్రీతి యూరాలజీ వైద్యులు… డాక్టర్ వి.చంద్రమోహన్ నేతృత్వంలో ఆమె రెండు కిడ్నీలను కాపాడారు. మహిళలకు వివిధ కారణాలతో గర్భసంచి తొలగించడం మామూలే. కానీ, హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళకు మూడేళ్ల క్రితం ఇలా గర్భసంచి తొలగించినప్పుడు.. ఇన్ఫెక్షన్ కారణంగానో, మరో కారణం చేతనో ఆమె రెండు మూత్రనాళాలు పై నుంచి కిందివరకు మొత్తం పాడైపోయాయి. ఇలా జరగడం అత్యంత అసాధారణం. ఆమెకు సుదీర్ఘ శస్త్రచికిత్స చేసి నయం చేసిన ప్రీతి యూరాలజీ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ చంద్రమోహన్ ఇందుకు సంబంధించిన వివరాలను తాజ్ డెక్కన్ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు.
“52 ఏళ్ల ఆ మహిళ గత మూడేళ్లుగా పలు రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ప్రధానంగా ఆమెకు కిడ్నీ ఇన్ఫెక్షన్లు రావడం, పదే పదే క్రియాటినైన్ పెరిగిపోవడం లాంటి సమస్యలున్నాయి. ఎప్పటికప్పుడు ఆమెకు స్టెంట్ వేసి చికిత్స చేసేవారు. సమస్య మరీ తీవ్రతరం కావడంతో.. ఆమె మా ఆస్పత్రికి వచ్చారు. సమగ్రంగా పరీక్షించినప్పుడు.. మూత్రనాళాలు పైనుంచి కింది వరకు మొత్తం పాడైపోయి, సన్నగా అయిపోయిన సంగతి తెలిసింది. కేవలం పైన కిడ్నీ తొడిమ మాత్రమే మిగిలింది. ఆమెకు క్రియాటినైన్ స్థాయి కూడా పెరిగిపోయి, కిడ్నీల పనితీరు కూడా దెబ్బతింది. ఇలా జరగడం అత్యంత అరుదైనది. ప్రపంచం మొత్తం మీద తొమ్మిది కేసులకు మాత్రమే ఇప్పటికి చికిత్స చేశారు. భారతదేశంలో ఇంతవరకు ఇలాంటి సమస్య ఎవరికీ రాలేదు.
ఎవరికైనా రేడియేషన్ ఇచ్చినప్పుడు మూత్రనాళాల్లో కిందిభాగం కొంత చెడిపోతుంది. కానీ పైనుంచి కింది వరకు మొత్తం 35 సెంటీమీటర్ల మేర మూత్రనాళాలు అంతా పాడైపోవడం మాత్రం ఉండదు. దాన్ని సరిచేయడం కూడా చాలా కష్టం అవుతుంది. దాంతో ఈమెకు లాప్రోస్కొపిక్ పద్ధతిలో శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించాం. సాధారణంగా లాప్రోస్కొపిక్ శస్త్రచికిత్సల్లో మూడు చిన్న రంధ్రాలే చేస్తాం. కానీ ఈమెకు పైన, కింద, ముందు, వెనక అన్నీ చూడాల్సి రావడంతో 13 రంధ్రాలు పెట్టి చేశాం. ఈమెకు మూత్రనాళాలు పూర్తిగా పాడైపోయి, సన్నగా అయిపోవడంతో అవి ఎందుకూ పనికిరావు. అందువల్ల చిన్న పేగుల్లోంచి 35 సెంటీమీటర్లను రెండు భాగాలుగా తీసుకుని వాటిని కిడ్నీ తొడిమ నుంచి బ్లాడర్‌కు రెండువైపులా అమర్చి కలిపి కుట్టాం. ఈ శస్త్రచికిత్సకు మొత్తం తొమ్మిదిన్నర గంటల సమయం పట్టింది. శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత రోగి లేచి నడవగలుగుతున్నారు. ఆమె క్రియాటినైన్ సాధారణ స్థాయికి చేరుకుంది” అని డాక్టర్ చంద్రమోహన్ వివరించారు.
దేశంలో ఇదే తొలిసారి
“ఇలా రెండువైపులా లాపరోస్కొపిక్ శస్త్రచికిత్సతో మూత్రనాళాలను మార్చిన చరిత్ర ఇంతవరకు భారతదేశంలో ఎక్కడా లేదు. గతంలో చైనాలో మాత్రం ఇది విజయవంతంగా జరిగింది. అక్కడ ఇప్పటివరకు మొత్తం 9 మందికి ఇలాంటి శస్త్రచికిత్సలు చేశారు. వాటి సగటు సమయం 6 గంటలు. భారతదేశంలోనూ గతంలో ఈ తరహా శస్త్రచికిత్సలు చేసినా, అవి లాపరోస్కొపిక్ కాదు. ఓపెన్ శస్త్రచికిత్సలు. ఇప్పుడు దేశంలో తొలిసారిగా పూర్తి లాపరోస్కొపిక్ (కీహోల్) పద్ధతిలో మూత్రనాళాలను రెండువైపులా సరిచేయడం ప్రీతి యూరాలజీ సాధించిన ఘనతగా చెప్పుకోవచ్చు. ఇందుకు అత్యాధునిక పరికరాలు ఉండడంతో పాటు, అనుభవజ్ఞులైన వైద్యులు, వారికి మూత్రనాళాల పునర్నిర్మాణ నైపుణ్యాలు ఉండడం అవసరం. ప్రీతి యూరాలజీలో ఇవన్నీ ఉండడం వల్లే ఇలాంటివి చేయగలుగుతున్నాం” అని డాక్టర్ చంద్రమోహన్ తెలిపారు.