Messi Hyderabad Visit Schedule: అర్జెంటీనా దిగ్గజం, ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ కాసేపటి క్రితం హైదరాబాద్‌కి చేరుకున్నారు. మెస్సీ రాకతో భాగ్యనగరంలో ఫుట్‌బాల్ ఫీవర్ మొదలైంది. శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఛాంపియన్‌కు ఘన స్వాగతం లభించింది. ఎయిర్‌పోర్టు బయట అభిమానులు ఆయనకు ప్లకార్డులతో వెల్‌కమ్ చెప్పారు. ఇక, ఉప్పల్ స్టేడియం వద్ద పండుగ వాతావరణం సంతరించుకుంది. కాసేపట్లో మెస్సీ.. ఉప్పల్ స్టేడియంకి రానున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి, మెస్సీకి మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున యువత, చిన్నారులు, అభిమానులు స్టేడియం వద్ద ఎదురుచూస్తున్నారు. దాదాపు ఒక గంట 15 నిమిషాల పాటు స్టేడియంలో వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. మరి ఇంతకీ ఆ షెడ్యూల్ ఏంటి.. వివరాలు ఇక్కడ చూద్దాం..
ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మెస్సీ.. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరగనుంది. అనంతరం ఆయన తన టీంతో ఉప్పల్ స్టేడియంకి చేరుకున్నారు. కాగా, మెస్సీ రాకతో స్టేడియం వద్ద, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కోల్‌కతాలో జరిగిన మాదిరిగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇక, ఉప్పల్ స్టేడియంలో మెస్సీ షెడ్యూల్ ఇలా..
Also Read: https://teluguprabha.net/telangana-news/rahul-gandhi-arrives-in-hyderabad-to-watch-football-match/
- 7.50PM: లియోనెల్ మెస్సీ- రేవంత్ రెడ్డి మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్‌కి సన్నాహకాలు ప్రారంభమవుతాయి.
- 08.06PM- రేవంత్ రెడ్డి గ్రౌండ్‌లోకి అడుగుపెట్టి తనకు నిర్దేశించిన మార్కింగ్‌లో నిలబడతారు.
- 08.07PM- గ్రౌండ్‌లోకి మెస్సీ ఎంట్రీ
- 08.08PM: రోడ్రిగో, లూయిస్ సూరజ్ మైదానంలోకి అడుగుపెడతారు.
- 08.13PM: GOAT కప్ విన్నర్ ఎవరో తేలనుంది.
- 08.15PM: టీం సభ్యులు, చిన్నారులతో గ్రూప్ ఫొటో కార్యక్రమం
- 08.17PM- 08.32PM- టికి- టికా సెషన్- ఈ కార్యక్రమంలో ఫుట్‌బాల్ దిగ్గజాలు.. స్థానిక అధికారులతో కలిసి, నాలుగు వేర్వేరు జోన్‌లలో “టికి- టాకా” సెషన్‌లలో పాల్గొంటారు. అక్కడ వారు పిల్లలతో కాసేపు సరదాగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
- 08.18PM: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంట్రీ
- 08.33PM: ఈవెంట్ ఆర్గనైజర్ అనుత్తమ్ రెడ్డితో మెస్సీ పెనాల్టీ షూట్ ఔట్
- 08.38PM: గ్రౌండ్‌లో అభిమానులకు మెస్సీ అభివాదం
- 08:48PM- 08:59PM- వేదికపై ప్రొటోకాల్ ప్రకారం లియోనెల్ మెస్సీ, ఎంపీ రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర ప్రముఖులు ఆసీనులు అవుతారు. నిర్వాహకులు, టీం యజమానులతో ఫొటోగ్రాఫీ సెషన్ ఉంటుంది. విజేత టీంకి, పార్టిసిపేటింగ్ టీంకి మెస్సీ, రాహుల్ గాంధీ చేతుల మీదుగా GOAT కప్ ప్రదానం కార్యక్రమం. సీఎం రేవంత్ చేతుల మీదుగా మెస్సీకి ప్రభుత్వం తరఫున కానుకతో పాటు సన్మానం నిర్వహిస్తారు.
- 09.10: ముగింపు కార్యక్రమం.
అనంతరం ఆయన ముంబయికి బయలుదేరనున్నారు. రేపు ముంబయిలో, సోమవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. కాగా, ఈ రోజు మధ్యాహ్నమే రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. కాగా, రేవంత్- మెస్సీ మధ్య మ్యాచ్‌ను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెస్సీతో తలపడేందుకు రేవంత్ గత కొన్ని రోజులుగా కఠోర సాధన చేస్తున్నారు. ఫుట్‌బాల్ తనకి ఇష్టమైన ఆట అని.. ఈ ఆటతో టీం స్పిరిట్‌ను ప్రదర్శించవచ్చని చెప్పారు. నాలుగు కోట్ల తెలంగాణ టీంకి లీడర్‌గా రాష్ట్రాన్ని గెలిపించేందుకు నిత్యం శ్రమిస్తానని పేర్కొన్నారు. కాగా, నిన్న వోక్సెన్ యూనివర్సిటీలో విద్యార్థులతో కలిసి కాసేపు ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేశారు.

