Ganesh Idol Robbery Case: అదేంటి టైటిల్ చదివి షాక్ అయ్యారా? వినాయకుడు కోర్టుకెళ్లడం ఏంటని అనుకుంటున్నారా? అవును మీరు చదివింది నిజమే. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందో కథనంలోకి వెళ్లి తెలుసుకుందాం..
గుట్టుచప్పుడు కాకుండా ట్రాలీలో ఎక్కించుకుని..
మరి కొద్ది రోజుల్లో వినాయక చవితి పండగ రానున్న సంగతి తెలిసిందే. అయితే ప్రతిఏటా మెదక్ పట్టణంలోని పిల్లికొట్టల్ వద్ద చంద్ర భవన్ కాంప్లెక్స్ లో గణనాధుల విగ్రహాలు తయారు చేసి విక్రయిస్తుంటారు. అలానే ఈ సారి కూడా అక్కడ, పండగ దగ్గర పడడంతో యజమాని సురేశ్, విగ్రహాలు తయారు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే గత నెల (జులై) 27న వినాయక విగ్రహాల తయారీ వద్ద నుంచి కొందరు యువకులు ఓ వినాయకుడిని దొంగతనంగా తీసుకెళ్లారు. గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి వేళ ఓ ట్రాలీ వాహనంలో వినాయకుడి విగ్రహాన్ని ఎక్కించుకుని తీసుకెళ్లారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
గంజాయి బ్యాచ్ మద్యం మత్తులో..
మరుసటి రోజు ఉదయం అక్కడికి చేరుకున్న యజమాని సురేశ్, విగ్రహం చోరీకి గురైన విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి గురైన వినాయక విగ్రహ కేసును సీసీటీవీ ఫూటేజీ ఆధారంగా త్వరగానే ఛేదించారు. అనంతరం మీడియా సమావేశంలో మెదక్ జిల్లా ఏఎస్పీ మహేందర్ చోరీ వివరాలు వెల్లడించారు. గంజాయి బ్యాచ్.. మత్తులో వినాయక విగ్రహాన్ని ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. నలుగురు నిందితులపై గతంలో కేసులు కూడా ఉన్నట్టు తెలిపారు. తాజాగా మరో కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు . నిందితులను రిమాండ్ కు తరలించి ట్రాలీ ఆటో, వినాయక విగ్రహాన్ని కోర్టుకు తరలించారు అధికారులు.


