Saturday, November 15, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్Birth Certificate : బర్త్ సర్టిఫికెట్‌కు బేరం.. తల్లిదండ్రుల బదులు తాత.. అవ్వల పేర్లు!

Birth Certificate : బర్త్ సర్టిఫికెట్‌కు బేరం.. తల్లిదండ్రుల బదులు తాత.. అవ్వల పేర్లు!

GHMC birth certificate scam: పుట్టిన బిడ్డకు కన్నవాళ్లే తల్లిదండ్రులు. కానీ, జీహెచ్‌ఎంసీ రికార్డుల్లో మాత్రం తాత, అవ్వలు కూడా తల్లిదండ్రులైపోతున్నారు! వినడానికి వింతగా ఉన్నా, ఇది భాగ్యనగరంలో కొందరు బల్దియా సిబ్బంది సృష్టిస్తున్న అవినీతి బాగోతం. బడిలో చేర్పించడం దగ్గర నుంచి పాస్‌పోర్ట్ వరకు ప్రతి దానికీ అత్యంత కీలకమైన జనన ధ్రువీకరణ పత్రం కోసం నగరవాసులకు నరకం చూపిస్తున్నారు. లంచం ఇస్తే తప్ప పని జరగని పరిస్థితి. అసలు ఈ దోపిడీ ఎలా సాగుతోంది..? ఉద్దేశపూర్వకంగా తప్పులు సృష్టించి ఎలా సొమ్ము చేసుకుంటున్నారు..?

- Advertisement -

అడుగడుగునా అవినీతి.. నెలల తరబడి నిరీక్షణ : జీహెచ్‌ఎంసీ పరిధిలో జనన ధ్రువీకరణ పత్రం పొందడం ఓ పెద్ద సవాలుగా మారింది. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న రెండు వారాల్లో పత్రం చేతికి రావాలి. కానీ ఇక్కడ నెలల తరబడి దరఖాస్తులను తొక్కిపెడుతున్నారు. నేరుగా సిబ్బందిని కలిసి రూ.1000 నుంచి రూ.2000 వరకు లంచం ముట్టజెబితేనే ఫైల్ కదులుతోంది. ఇది ఒక ఎత్తయితే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.

సొమ్ము చేసుకొనేందుకే ఈ మాయాజాలం : గాంధీ, పేట్లబురుజు, కోఠి ప్రసూతి ఆసుపత్రుల్లో ప్రసవాల రికార్డుల్లో 90 శాతం వరకు తప్పులు దొర్లుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇది పొరపాటున జరుగుతున్న తప్పు కాదని, సిబ్బంది ఉద్దేశపూర్వకంగానే తప్పులు సృష్టిస్తున్నారని వాపోతున్నారు.

తల్లిదండ్రుల పేర్ల బదులు: కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల పేర్లకు బదులుగా, బిడ్డను ఆసుపత్రికి తీసుకొచ్చిన తాత, అవ్వల పేర్లను నమోదు చేస్తున్నారు.

అక్షర దోషాలు, ఇంటిపేరు మాయం: తండ్రి పేరు ‘నరసింహులు’ అయితే ‘నరసిమ్లు’ అని రాయడం, ఇంటిపేరును పూర్తిగా తొలగించడం వంటివి చేస్తున్నారు. ఈ తప్పులను సరిచేయాలంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి, మళ్లీ నెలల తరబడి ఎదురుచూడాలి. ఈ జాప్యాన్ని అదనుగా తీసుకుని, “పని తొందరగా కావాలంటే” డబ్బులు వసూలు చేయడమే వీరి అసలు ఉద్దేశమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిలువెత్తు నిదర్శనాలివిగో :

గాంధీ ఆసుపత్రి (CNI 022502380770): జూన్ 23, 2025న దరఖాస్తు చేసుకున్నా నేటికీ ఆమోదం రాలేదు. తండ్రి పేరులో అక్షర దోషం, ఇంటిపేరు లేకపోవడం గమనార్హం.

పేట్లబురుజు ఆసుపత్రి (CNI 022502420640): నెల కిందట దరఖాస్తు చేసుకున్నా, రికార్డుల్లో తల్లిదండ్రుల పేర్లు, ఇంటిపేరు లేకుండా నమోదు చేశారు. దీంతో మళ్లీ సవరణకు దరఖాస్తు చేసుకోవాల్సిన దుస్థితి.

మరో దరఖాస్తు (CNI 022502359540): మే 29, 2025న చేసుకున్న ఈ దరఖాస్తును మూడున్నర నెలలుగా పట్టించుకున్న పాపాన పోలేదు.

నిబంధనలు గాలికి : జనన మరణాల నమోదు చట్టం, 1969 ప్రకారం శిశువు పుట్టిన 21 రోజుల్లోపు జననాన్ని నమోదు చేయాలి. దరఖాస్తులను 14 రోజుల్లో పరిష్కరించాలి. కానీ జీహెచ్‌ఎంసీలో ఈ నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి. లంచం ఇస్తే తప్ప జనన ధ్రువపత్రం జారీకాని ఈ దౌర్భాగ్య పరిస్థితిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి, అవినీతి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad