Sunday, November 16, 2025
HomeTop StoriesSeal and Deal: హంగామా చేసి 'సీజ్'.. చేయి తడిపితే 'ఓపెన్'! అక్రమ నిర్మాణాలపై అధికారుల...

Seal and Deal: హంగామా చేసి ‘సీజ్’.. చేయి తడిపితే ‘ఓపెన్’! అక్రమ నిర్మాణాలపై అధికారుల లీలలు!

Corruption in GHMC illegal constructions : సీజ్ చేస్తారు.. హడావుడి చేస్తారు.. కానీ తెరవెనుక మంతనాలు జరిపి, చేయి తడిపితే చాలు, సీల్ తీసేస్తారు! హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై కొందరు జీహెచ్‌ఎంసీ అధికారులు ఆడుతున్న నాటకమిది. చట్టాన్ని చుట్టంగా మార్చుకుని, ‘సీజ్’ అనే అధికారాన్ని అవినీతికి ఆయుధంగా వాడుకుంటున్నారు. ఉన్నత న్యాయస్థానాల ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ, అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న ఈ లంచావతారాల బాగోతంపై ప్రత్యేక కథనం.

- Advertisement -

అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా చేపట్టే అక్రమ నిర్మాణాలను ప్రాథమిక దశలోనే గుర్తించి, ‘సీజ్’ చేయాలని సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చాయి. ఈ మేరకు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, సర్కిల్, జోనల్ కమిషనర్లకు భవనాలను సీజ్ చేసే పూర్తి అధికారాలను కట్టబెట్టారు. కానీ, కొందరు అవినీతి అధికారులు దీనిని అక్రమ సంపాదనకు మార్గంగా మార్చుకున్నారు.

సీజ్.. డీల్.. ఓపెన్ : అధికారులు అనుసరిస్తున్న తీరు గమనిస్తే, ఇదో పక్కా ప్రణాళికతో సాగుతున్న దందా అని స్పష్టమవుతోంది.

హంగామా చేసి సీజ్: తొలుత అక్రమ నిర్మాణం వద్దకు వెళ్లి, హంగామా చేసి, భవనాన్ని సీజ్ చేసి, తాళం వేస్తారు.

తెరవెనుక బేరసారాలు: ఆ తర్వాత, భవన యజమానితో తెరవెనుక బేరసారాలు జరుపుతారు. లక్షల్లో ముడుపులు ముట్టగానే, అంతా సద్దుమణుగుతుంది.

పనుల పునఃప్రారంభం: కొద్ది రోజులకే, సీజ్ చేసిన భవనం దగ్గర మళ్లీ పనులు యథేచ్ఛగా మొదలవుతాయి. అటువైపు అధికారులు కన్నెత్తి కూడా చూడరు.

నిలువెత్తు నిదర్శనాలు : గ్రేటర్ పరిధిలో ఇప్పటివరకు 300కు పైగా భవనాలను సీజ్ చేసినా, వాటిలో చాలా వరకు పనులు తిరిగి ప్రారంభమయ్యాయి.

కొండాపూర్: రాఘవేంద్ర కాలనీలో G+2కు అనుమతి తీసుకుని, ఆరు అంతస్తులు కట్టగా, అధికారులు సీజ్ చేశారు. కానీ, రూ.20 లక్షలు చేతులు మారడంతో, నెల తిరక్కుండానే పనులు మళ్లీ మొదలయ్యాయి.

జూబ్లీహిల్స్: అన్నపూర్ణ స్టూడియో సమీపంలో అనుమతి లేకుండా కడుతున్న ఆరంతస్తుల భవనాన్ని సీజ్ చేసినా, పనులు ఆగలేదు. అదే సర్కిల్‌లో, అనుమతి లేకుండా ఏకంగా ఓ కార్ల షోరూమ్‌నే ఏర్పాటు చేశారు. సీజ్ చేయడానికి వెళ్లిన అధికారులు, ఖాళీ చేతులతో వెనుదిరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

అధికారుల హెచ్చరికలు నామమాత్రమేనా : “సీజ్ చేసిన భవనాలను నిబంధనలకు విరుద్ధంగా తెరిస్తే, క్రిమినల్ కేసులు పెడతాం. అలాంటి అధికారులను గుర్తించి చర్యలు తీసుకుంటాం,” అని నగర ముఖ్య ప్రణాళికాధికారి శ్రీనివాస్ హెచ్చరిస్తున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడం లేదు. ముఖ్యంగా శేరిలింగంపల్లి (మాదాపూర్, కొండాపూర్), ఖైరతాబాద్ (జూబ్లీహిల్స్, బంజారాహిల్స్) జోన్లలో ఈ దందా ఎక్కువగా సాగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఒకవైపు చెరువులు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న అధికారులు, మరోవైపు ప్రైవేట్ స్థలాల్లోని అక్రమ నిర్మాణాల విషయంలో లంచాలకు లొంగిపోవడం, వారి ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad