Heavy Rainfall In Hyderabad: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, ఎర్రగడ్డ, పంజాగుట్ట, అమీర్‌పేట, యూసఫ్‌గూడ, బోరబండ, చార్మినార్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో గంటలకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. దీంతో, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని అధికారులు హెచ్చరించారు. కాగా, హైదరాబాద్‌లో బుధవారం కూడా భారీ వర్షం కురిసింది. భారీ వర్షం దాటికి రోడ్లు జలమయంగా మారాయి. దీంతో అర్థరాత్రి వరకు ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఆఫీసుల నుంచి వచ్చేవారు, విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.


