Heavy Rains in Hyderabad city These are the Effected Areas: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతంగా మారింది. దీంతో, ఉన్నట్టుండి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. దీంతో, రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు వచ్చి చేరింది. ప్రధానంగా కూకట్‌పల్లి, మూసాపేట్, నిజాంపేట, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, అల్వాల్, తార్నాక, ఎల్బీనగర్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, హఫీజ్‌పేట్, మియాపూర్, చందానగర్, బీహెచ్ఈఎల్, మదినగూడ, బాచుపల్లి, దుండిగల్, మల్లంపేట ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షం కురిసింది. కాగా, భారీ వర్షం కారణంగా రోడ్లపై వర్షపు నీరు నిలిచి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలుల తీవ్రతకు పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. వర్షపు నీటితో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిన్న (శుక్రవారం) కూడా హైదరాబాద్‌లో ఎలాంటి ఉరుములు, మెరుపులు లేకండానే పెద్ద ఎత్తున వర్షం కురిసింది. వర్షాలకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అలాగే నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెహికిల్స్ నెమ్మదిగా కదలడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఏపీలో మెంథా తుఫాను హెచ్చరికలు..
మరోవైపు, జీహెచ్‌ఎంసీ పరిధిలో రానున్న రెండు గంటల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం.. అల్ప పీడనం కారణంగా నగరంలో ఒకటి లేదా రెండు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు, ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. సోమ, మంగళ వారాల్లో రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నెల 27న భారీ వర్షాలు పడే అవకాశముందని.. బాపట్ల, ప్రకాశం, కడప, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. 20 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇక, నంద్యాల, చిత్తూరు, పల్నాడు, గుంటూరు, కృష్ణ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ నెల 28న కాకినాడ సమీపంలో మెంథా తీవ్ర తుఫాన్ తీరం దాటనుంది. తీవ్ర తుఫాన్ తీరం దాటే సమయంలో కాకినాడ, ఉభయగోదావరి, ఏలూరు, గుంటూరు, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.


