Adulterated food in Hyderabad: ఆదివారం వచ్చిందంటే చాలు… ఘుమఘుమలాడే బిర్యానీ కోసం మనసు లాగేస్తుంది. అందులోనూ ‘తక్కువ ధరకే బిర్యానీ’ అని బోర్డు కనిపిస్తే, అడుగులు అటువైపే పడతాయి. కానీ, ఆ కమ్మని వాసన వెనుక దాగి ఉన్న అసలు కథేంటి..? మనం డబ్బు ఆదా చేస్తున్నామా లేక అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నామా..? ఆ చౌక బిర్యానీలో వాడే పదార్థాలు మన ప్రాణాలతో ఎలా చెలగాటమాడుతున్నాయో తెలుసా..? ఇటీవల ఆహార భద్రతా అధికారుల తనిఖీల్లో వెలుగుచూసిన చేదు నిజాలు మీకోసం…
చౌక బిర్యానీ… చేటు చేసే పదార్థాలు: వారాంతాల్లో హైదరాబాద్ బిర్యానీకి ఉండే గిరాకీని ఆసరాగా చేసుకుని, కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. తక్కువ ధరకే బిర్యానీ అంటూ నాణ్యతలేని, హానికరమైన పదార్థాలతో వండి వారుస్తున్నారు. మీరు ఎగబడి తినే ఆ బిర్యానీలో ఏముందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
నిల్వ మాంసం: కొన్ని రోజుల పాటు రిఫ్రిజిరేటర్లలో నిల్వ ఉంచిన, నాణ్యత లేని కోడి మాంసాన్ని వాడుతున్నారు. ఇది ఫుడ్ పాయిజన్‌కు ప్రధాన కారణం.
నాసిరకం సరకులు: నాణ్యత లేని బాస్మతి బియ్యం, చౌకగా దొరికే పామాయిల్, కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును విరివిగా వినియోగిస్తున్నారు.
ప్రమాదకర రసాయనాలు: రుచి కోసం ‘టేస్టింగ్ సాల్ట్’ (అజినోమోటో)ను అధికంగా వాడటం వల్ల పేగులు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆకర్షణీయమైన రంగు కోసం వాడే కృత్రిమ రంగులు క్యాన్సర్‌కు దారితీయవచ్చు.
అధికారుల తనిఖీల్లో వెలుగుచూసిన నిజాలు: ఆహార భద్రతా అధికారుల తనిఖీల్లో కొన్ని హోటళ్ల బండారం బయటపడింది.
గచ్చిబౌలి: మహాలక్ష్మి బిర్యానీ సెంటర్‌లో రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసాన్ని అధికారులు గుర్తించారు.
నాంపల్లి: ఓ ప్రముఖ హోటల్‌లో గడువు ముగిసిన (expired) పదార్థాలను వంటకాల్లో వాడుతున్నట్లు తేల్చారు.
ఉప్పల్: ఓ బిర్యానీ సెంటర్‌లో ముందురోజు మిగిలిపోయిన బిర్యానీని మరుసటి రోజు వేడి చేసి విక్రయిస్తున్నట్లు వెల్లడైంది.
మీరేం చేయాలి… ఎవరికి ఫిర్యాదు చేయాలి : కళ్లముందే ఇలాంటి మోసాలు జరుగుతున్నా, చాలా హోటళ్లపై తనిఖీలు జరగడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. మీకు ఏదైనా హోటల్‌పై అనుమానం వస్తే, లేదా కల్తీ జరుగుతోందని తెలిస్తే, వెంటనే ఆహార భద్రతా అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. మీరు చేయాల్సిందల్లా, ప్రాంతం, హోటల్ పేరు స్పష్టంగా తెలిపి ఫిర్యాదు చేయడమే.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫిర్యాదుల కోసం..
టోల్-ఫ్రీ నంబర్: 040-21111111
ట్విటర్ (ఎక్స్): @afcghmc
మెయిల్: [email protected]
వైద్యులు హెచ్చరిస్తున్నట్లుగా, బయట తినేటప్పుడు కాస్త ఆలోచించి, నమ్మకమైన చోట మాత్రమే తినడం ఉత్తమం. లేదంటే, తక్కువ ధరకు రుచిని కొని, భవిష్యత్తులో మన ఆరోగ్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది.


