Hydroponic Ganja Seizure : హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం హై-టెన్షన్ డ్రామా చోటుచేసుకుంది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి అనుమానాస్పద ప్రవర్తన, కంగారు అధికారుల దృష్టిని ఆకర్షించింది. ముందే అందిన పక్కా సమాచారంతో నిఘా పెట్టిన నార్కోటిక్స్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని లగేజీని తనిఖీ చేయగా, ఊహించని రీతిలో ఖరీదైన మత్తుపదార్థం బయటపడింది. ఇంతకీ ఆ ప్రయాణికుడు ఎవరు…? అతను తెచ్చిన ఆ ఖరీదైన గంజాయి ప్రత్యేకత ఏమిటి..? దాని విలువ ఎంత ఉంటుంది..?
పక్కా సమాచారంతో పక్కా ప్లాన్: ఆగస్టు 13, బుధవారం బ్యాంకాక్ నుంచి శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న విమానంలో వచ్చిన ప్రయాణికుల్లో ఒకడు తీవ్రమైన కంగారు, ఆందోళనతో కనిపించాడు. అతని కదలికలను గమనించిన యాంటీ నార్కోటిక్స్ ఏజెన్సీ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు సమాచారం ఉండటంతో, అధికారులు అతని లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో, అతని బ్యాగులో అత్యంత చాకచక్యంగా దాచిన 6.30 గ్రాముల హైడ్రోపోనిక్ గంజాయిని గుర్తించారు. నిందితుడిని నగరానికి చెందిన షేక్ అథర్ ఇబ్రహీంగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
ఏమిటీ హైడ్రోపోనిక్ గంజాయి : సాధారణంగా గంజాయి మొక్కలను మట్టిలో పెంచుతారు. అయితే, హైడ్రోపోనిక్ పద్ధతిలో మట్టి అవసరం లేకుండా, మొక్కల వేర్లను నేరుగా పోషకాలతో నిండిన నీటిలో ఉంచి పెంచుతారు.దీనివల్ల మొక్కకు అవసరమైన ఆక్సిజన్, నీరు, పోషకాలు సమృద్ధిగా అంది, చాలా వేగంగా పెరుగుతుంది. అంతేకాదు, సాధారణ గంజాయి కంటే చాలా శక్తివంతమైన మత్తును కలిగిస్తుంది. ఈ పద్ధతి ద్వారా పండించిన గంజాయికి అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది.
కోట్లలో ధర.. భారీ నెట్‌వర్క్: ఆగ్నేయాసియా దేశమైన థాయిలాండ్‌లో హైడ్రోపోనిక్ గంజాయి సాగు, సరఫరా ఎక్కువగా జరుగుతున్నట్లు సమాచారం. దీని నాణ్యతను బట్టి కిలో ధర రూ.30 లక్షల నుంచి కోటి రూపాయల వరకు పలుకుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పట్టుబడిన గంజాయి చిన్న మొత్తమే అయినా, దీని వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, తదుపరి విచారణ జరుపుతున్నారు. ఈ గంజాయిని ఎవరి కోసం తీసుకువచ్చాడు..? ఈ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న ఇతరులు ఎవరు..? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇటీవలి కాలంలో శంషాబాద్ విమానాశ్రయంలో బ్యాంకాక్ నుంచి వచ్చే ప్రయాణికుల నుంచి హైడ్రోపోనిక్ గంజాయిని పట్టుకోవడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ పలుమార్లు భారీ మొత్తంలో ఈ రకం గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


