Hyderabad Drug Racket : హైదరాబాద్ నగర శివార్లలోని చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతం ఇప్పుడు భారీ డ్రగ్స్ రాకెట్ వార్తలతో కలకలం రేపుతోంది. ముంబైకి చెందిన మీరా-భయందర్, వసాయి-విరార్ (MBVV) పోలీసుల యాంటీ-నార్కోటిక్స్ సెల్, క్రైమ్ బ్రాంచ్ టీమ్ ఈ ముఠాను ఛేదించి, సుమారు రూ. 12,000 కోట్ల విలువైన మెఫెడ్రోన్ (MD) డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇది ఈ ఏడాది అతిపెద్ద డ్రగ్స్ హాల్‌గా నిలిచింది.
MBVV పోలీస్ కమిషనర్ నికేత్ కౌశిక్ నేతృత్వంలోని టీమ్ కొన్ని వారాలుగా ఈ డ్రగ్స్ ముఠాపై నిఘా పెట్టింది. గూఢచారులు రహస్యంగా ఆపరేషన్ చేసి, ముఠా మూలాలు హైదరాబాద్ చర్లపల్లిలో ఉన్నట్టు కనుగొన్నారు. ‘వాఘ్దేవి ల్యాబ్స్’ పేరుతో నకిలీ లైసెన్స్‌తో నడుస్తున్న ఈ ఫ్యాక్టరీ బయటికి సాధారణ రసాయన యూనిట్‌లా కనిపించినా, లోపల అత్యాధునిక పరికరాలతో భారీగా డ్రగ్స్ తయారు చేస్తున్నారు.
పోలీసులు మెరుపుదాడి చేసి, ఫ్యాక్టరీ యజమాని, రసాయన నిపుణుడైన శ్రీనివాస్ వలోట్టి, అతని సహచరుడు తనాజీ పాటే, ఓ విదేశీయుడు సహా మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. ముందుగా 100 గ్రాముల MD డ్రగ్, రూ. 25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాక్టరీలో సోదాలు చేస్తే, డ్రగ్స్ తయారీకి ఉపయోగించే 32,000 లీటర్ల రసాయనాలు, పెద్ద పెద్ద ఉత్పత్తి యూనిట్లు దొరికాయి. ఇవన్నీ సీజ్ చేసి, ఫ్యాక్టరీని సీల్ చేశారు.
ఈ ముఠా హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. పోలీసులు ముఠా సభ్యులను విచారించడంతో ఇంటర్‌స్టేట్ నెట్‌వర్క్ బయటపడింది. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా సోదాలు చేస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో పోలీసులు చాలా రిస్క్ తీసుకుని ముఠాలోకి చొచ్చుకుపోయి సమాచారం సేకరించారు.
ఇక ఇలాంటి డ్రగ్స్ రాకెట్లు యువతను నాశనం చేస్తున్నాయి. పోలీసుల ఈ చర్యతో మాదక ద్రవ్యాల సరఫరా గొలుసుకు పెద్ద దెబ్బ తగిలింది. ఇంకా ఎవరెవరు ఇందులో ఉన్నారో తెలుసుకోవడానికి దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సమాజంలో డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, ఇలాంటి విషయాలు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలుపుతున్నారు.


