Saturday, November 15, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్Hyderabad: నగర వాసులకు పోలీసుల హెచ్చరిక..పిల్లల్ని ఎత్తుకుపోయే వారు తిరుగుతున్నారు!

Hyderabad: నగర వాసులకు పోలీసుల హెచ్చరిక..పిల్లల్ని ఎత్తుకుపోయే వారు తిరుగుతున్నారు!

Hyderabad-Child Rescue: హైదరాబాద్‌లో చిన్నారులపై జరుగుతున్న కిడ్నాప్‌ ఘటనలు తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో పిల్లలను ఎత్తుకుపోతూ భయాందోళన సృష్టించిన ముఠా ని చివరికి చందానగర్‌ పోలీసుల పట్టుకున్నారు. ఈ ముఠా సభ్యులు పిల్లలను అపహరించి వారిని విక్రయించాలనే ఉద్దేశంతో ఉన్నారని పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.

- Advertisement -

పెద్దలు లేని సమయంలో…

మాదాపూర్‌ డీసీపీ వినీత్ మంగళవారం మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం, ఈ ముఠా ప్రధానంగా ఇంట్లో పెద్దలు లేని సమయంలో పిల్లలను లక్ష్యంగా చేసుకుంటోంది. ముందుగా పరిసరాలను గమనించి, అవకాశమున్నపుడు చిన్నారులను ఎత్తుకెళ్లడం వీరి పద్ధతని అధికారులు తెలిపారు.

లింగంపల్లిలో మరో బాలిక…

ఆగస్టు 25న లింగంపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద జరిగిన ఘటనతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఏడాదిన్నర వయసున్న ఒక చిన్నారిని ఈ ముఠా సభ్యులు ఎత్తుకుపోయారు. ఆ తర్వాత కాచిగూడ ప్రాంతంలో ఐదేళ్ల బాలికను, లింగంపల్లిలో మరో బాలికను కూడా కిడ్నాప్ చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. అంతేకాదు, గత సంవత్సరం ఐదేళ్ల బాలుడిని కూడా ఇదే ముఠా అపహరించినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు మొత్తం నలుగురు చిన్నారులను రక్షించారు. వీరిలో ఇద్దరు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు. పిల్లలు సురక్షితంగా తమ కుటుంబాలకు చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

వేరే ప్రాంతాలకు విక్రయించాలనే..

అయితే, ఈ ముఠా వెనుక ఉద్దేశం ఏమిటనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. దత్తత పేరుతో పిల్లలను అపహరించారా, లేక వేరే ప్రాంతాలకు విక్రయించాలనే యత్నమా అనే కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠా పెద్ద స్థాయిలో పనిచేస్తోందా, లేక స్థానికంగా మాత్రమే పరిమితమా అన్నది కూడా పరిశీలనలో భాగమైంది.

పోలీసులు తల్లిదండ్రులు, స్థానిక ప్రజలకు ప్రత్యేక సూచనలు చేశారు. పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే బంధువులు లేదా పరిచయస్తులలో ఎవరైనా చిన్నారులు కనిపించకపోతే ఆలస్యం చేయకుండా దగ్గర్లోని పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.

Also Read: https://teluguprabha.net/devotional-news/vastu-rules-for-pooja-room-to-bring-peace-and-positive-energy/

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad