Hyderabad : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగర అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో హైటెక్ సిటీ నిర్మాణాన్ని అవహేళన చేసినట్లే, ఇప్పుడు మూసీ నది ప్రక్షాళనపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. రాజీవ్ గాంధీ వల్లే ఐటీ రంగంలో చాలా మంది తెలుగువారు రాణిస్తున్నారని, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్ర కూడా ముఖ్యమని చెప్పారు. 1994 నుంచి 2014 వరకు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన సీఎంలు గుర్తు చేశారు. గూగుల్ వంటి కంపెనీల్లో తెలుగువారు పెద్ద పదవుల్లో ఉన్నారని తెలిపారు.
గచ్చిబౌలిలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు శంకుస్థాపన చేసిన సందర్భంలో మాట్లాడుతూ, హైదరాబాద్ సింగపూర్, టోక్యోలతో పోటీ పడుతోందని అన్నారు. అమెరికాలో మన ఐటీ నిపుణులు లేకుంటే ఆ దేశం స్తంభించిపోతుందని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, ఉద్యోగ భద్రత ఇచ్చామని, రాబోయే 10 ఏళ్లలో 1 బిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
మూసీ ప్రక్షాళన ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. మురికిలో బతకాలని పేదలు ఎందుకు అనుకుంటారని అన్నారు. తెలంగాణ రైజింగ్ 2047తో సమగ్ర అభివృద్ధి చేద్దామని పిలుపిచ్చారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన తప్పక జరగాలని చెప్పారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సౌకర్యాలు లేవని, అన్ని సౌకర్యాలతో నిర్మిస్తామని అన్నారు. అభివృద్ధిని అడ్డుకునేవారు మన శత్రువులే అని హెచ్చరించారు.
మూసీ ప్రక్షాళనతో హైదరాబాద్ వరదల నుంచి రక్షణ పొందుతుందని, సబర్మతి, గంగా నదుల మాదిరి అభివృద్ధి చేస్తామని రేవంత్ అన్నారు. పాత బస్తీని ఒరిజినల్ సిటీగా మారుస్తామని, పూర్వ వైభవం తెస్తామని చెప్పారు. కేంద్రం నుంచి 46 వేల కోట్లు కోరారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో న్యూయార్క్‌తో పోటీ పడుతామని అన్నారు. ఇటీవల ఎచ్‌సీఎల్, గూగుల్ క్యాంపస్‌లు వచ్చాయి. జపాన్‌తో మెగా డీల్ కుదిరింది. మూసీ వెంబడి డెమాలిషన్ డ్రైవ్ జరుగుతోంది. ప్రజలు అభివృద్ధికి సహకరించాలని కోరారు.


