Saturday, November 15, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్Drug addiction : మత్తు కోరల్లో హైదరాబాద్.. 32 వేల మంది అరెస్ట్! యువతను చిత్తుచేస్తున్న...

Drug addiction : మత్తు కోరల్లో హైదరాబాద్.. 32 వేల మంది అరెస్ట్! యువతను చిత్తుచేస్తున్న డ్రగ్స్!

Drug menace in Hyderabad : మాయదారి మత్తు.. ఇంటింటా చిచ్చు! విలాసాల కోసం వెంపర్లాట, ఒత్తిడి నుంచి ఉపశమనం అనే సాకుతో యువత పెడదారి పడుతోంది. హైదరాబాద్ మహానగరం నలువైపులా డ్రగ్స్ మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. చదువుల నుంచి ఉద్యోగాల వరకు, కాపురాల నుంచి కెరీర్ల వరకు.. ఈ మత్తు విషం ఎన్నో జీవితాలను చిదిమేస్తోంది. “మా వాడిని కాపాడండి, అవసరమైతే జైల్లో పెట్టండి” అంటూ పోలీసులకు వస్తున్న వందలాది ఫోన్ కాల్స్, ఈ సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నాయి. అసలు ఈ మత్తు ఉచ్చు ఎంత లోతుగా పాకింది..? యువత ఎందుకు దీనికి బానిసలవుతోంది..?

- Advertisement -

దిమ్మతిరిగే లెక్కలు.. ఈగల్ నివేదిక : తెలంగాణ ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈగల్) విడుదల చేసిన గణాంకాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.

కేసులు: రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 15,847 కేసులు నమోదు.
అరెస్టులు: ఈ కేసుల్లో ఏకంగా 32,546 మందిని అరెస్ట్ చేశారు.
స్వాధీనం: సుమారు రూ.150 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

కారణాలు విని.. పోలీసులే షాక్ : ఒకప్పుడు ఒత్తిడి నుంచి ఉపశమనం కోసమే డ్రగ్స్ వాడేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.

కొత్త ఆనందం కోసం: ‘కొత్త ఆనందాన్ని’ వెతుక్కుంటూ డ్రగ్స్ రుచి చూస్తున్నామని పట్టుబడిన వారు చెప్పడం పోలీసులనే విస్మయానికి గురిచేస్తోంది.

శృంగార సామర్థ్యం కోసం: తాజాగా పట్టుబడిన 20 మందిలో, 12 మంది శృంగార సామర్థ్యం పెంచుకోవడానికే గంజాయి, ఎండీఎంఏ వంటివి వాడుతున్నామని చెప్పడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఇది కేవలం అపోహేనని వైద్యులతో కౌన్సెలింగ్ ఇప్పించాల్సి వచ్చింది.

విలాసాల ఊబిలో : పబ్ సంస్కృతి, హై-ఎండ్ పార్టీలు, డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయాలు.. ఈ విలాసవంతమైన జీవనశైలి యువతను మత్తు ఊబిలోకి లాగుతోంది.
“ఒక్కసారి తీసుకుంటే ఏమవుతుంది?” అనే ధీమాతో మొదలుపెట్టి, బానిసలుగా మారుతున్నారు. కొందరు ఇక్కడ దొరికిపోతామని భయపడి, గోవా, శ్రీలంక, థాయ్‌లాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లి మరీ డ్రగ్స్ పార్టీలు చేసుకుంటున్నారు.డేటింగ్ యాప్‌లు, వాట్సాప్ గ్రూపుల ద్వారా ఏర్పడిన సహజీవన సంబంధాల్లో చాలామంది డ్రగ్స్‌కు బానిసలైన వారే ఉంటున్నారని దర్యాప్తులో తేలింది. ఇటీవల హైటెక్‌సిటీలో 100 మందిని అదుపులోకి తీసుకుంటే, అందులో నలుగురు భార్యాభర్తలు కలిసి డ్రగ్స్ తీసుకుంటున్నట్లు గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది.

సాకు మాత్రమే : ఉద్యోగంలో ఒత్తిడి, చిన్న చిన్న సమస్యలకే డ్రగ్స్‌ను ఆశ్రయిస్తున్నామని చెప్పడం కేవలం ఒక సాకు మాత్రమేనని మానసిక నిపుణులు చెబుతున్నారు.

విలాసవంతమైన జీవితంపై మోజు, జల్సాలకు అలవాటు పడటమే దీనికి ప్రధాన కారణం. మొదట సిగరెట్, మద్యంతో మొదలై, ఆ తర్వాత డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారు.
ఈ మత్తు మహమ్మారిని అరికట్టాలంటే పోలీసుల చర్యలతో పాటు, తల్లిదండ్రుల పర్యవేక్షణ, యువతలో అవగాహన కల్పించడం అత్యవసరం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad