Hyderabad Engineer Arrest: ఇటీవల పూణే యూనివర్సిటీని లక్ష్యంగా చేసుకుని ఒక పెద్ద సైబర్ మోసం ఘటన వెలుగులోకి వచ్చింది. ఐఐటీ బాంబే ప్రొఫెసర్‌గా పరిచయం చేసుకుని, కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇప్పిస్తానంటూ యూనివర్సిటీ అధికారులను మోసగించిన ఘటనలో పోలీసులు హైదరాబాద్‌కు చెందిన కిలారు సీతయ్య అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ప్రాజెక్టుల ఆశచూపి ఏకంగా రూ.2.46 కోట్లు కాజేసిన వ్యవహారం బయటపడింది.
సీతయ్య జూలై 25 నుంచి ఆగస్టు 26 మధ్య కాలంలో ఈ మోసానికి పాల్పడ్డాడు. ఆయన పూణే యూనివర్సిటీ ప్రధాన అధికారిలో ఒకరికి ఫోన్ చేసి తనను తాను ఐఐటీ బాంబే ప్రొఫెసర్‌గా పరిచయం చేసుకున్నాడు. రూ.28 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులు యూనివర్సిటీకి వస్తాయని నమ్మబలికాడు. అయితే ఆ ప్రాజెక్టులు పొందాలంటే ముందుగా అడ్వాన్స్ చెల్లించాల్సిన అవసరం ఉందని చెప్పి తొలుత రూ.56 లక్షలు వసూలు చేశాడు. అక్కడితో ఆగక.. తర్వాత ఒక్కోసారి వేరువేరు పేర్లతో ప్రాజెక్టులపై ఒప్పందం తీసుకురావాలని నమ్మించి మొత్తంగా రూ.2.46 కోట్లు కొల్లగొట్టాడు.
కాలం గడిచినా ఆయన యూనివర్సిటీకి రాకపోవడంతో అనుమానం కలిగిన అధికారులు అసలు ఐఐటీ ప్రొఫెసర్‌తో సంప్రదించగా.. తనకు ఈ విషయం తెలియదని స్పష్టం చేశారు. దాంతో మోసపోయామని గ్రహించిన యూనివర్సిటీ పోలీసులను ఆశ్రయించింది. విచారణ అనంతరం ఈ ఘటన వెనుక కిలారు సీతయ్యనే సూత్రధారిగా పోలీసులు గుర్తించి, సెప్టెంబర్ 21న అరెస్టు చేశారు. సీతయ్య ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసి.. యూకే నుంచి పీహెచ్‌డీ సాధించాడు. అతను 2019-20లో యూపీఎస్సీ ప్రిలిమ్స్, మెయిన్స్ రాసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
అయితే సీతయ్య గతంలోనూ మోసాలకు పాల్పడిన వ్యక్తే. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని లక్షలు వసూలు చేసిన అనేక కేసులు అతనిపై ఉన్నాయి. లింక్డిన్, నౌకరీల ద్వారా నిరుద్యోగులకు ఎరిక్సన్ గ్లోబల్ ఇండియా అనే పేరుతో జాబ్స్ ఆఫర్ చేసినట్లు కేసులో బయటపడింది. ఒక్కొక్కరి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి ఆ డబ్బుతో ఆన్‌లైన్ గేమ్స్, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, విలాసవంతమైన ఖర్చులకు ఖర్చుచేశాడు. ఈ మోసాలపై ఇప్పటికే 8 కేసులు నమోదై అతను జైలు శిక్ష అనుభవించాడు.
జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా సీతయ్య తన పాత అలవాట్లను వదలకుండా మరోసారి పూణే యూనివర్సిటీని లక్ష్యంగా చేసుకున్నాడు. ప్రస్తుతం అతడు పోలీసుల కస్టడీలో ఉండగా.. మరింత మంది అతడి బాధితుల గురించి బయటపడే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈ సంఘటన విద్యాసంస్థలు, ఉద్యోగార్థులు మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.


