Saturday, November 15, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్Hyderabad IT Fraud: సాఫ్ట్‌వేర్‌ స్వప్నం.. సైబర్‌ మోసం! ల్యాప్‌టాప్‌ చేతికి.. లక్షలు హాంఫట్!

Hyderabad IT Fraud: సాఫ్ట్‌వేర్‌ స్వప్నం.. సైబర్‌ మోసం! ల్యాప్‌టాప్‌ చేతికి.. లక్షలు హాంఫట్!

Hyderabad IT job scam : హైటెక్ సిటీలో కొలువు.. చేతినిండా జీతం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉజ్వల భవిష్యత్తు.. బీటెక్ పూర్తిచేసిన ప్రతి యువతీ యువకుడి కళ్లలో మెరిసే కల ఇది. కానీ, ఈ కలను సాకారం చేసుకునే ఆత్రుతనే ఆసరాగా చేసుకుని కొన్ని నరరూప రాక్షసులు నగరంలో తిష్టవేశారు. ప్రాజెక్టులు లేకున్నా ల్యాప్‌టాప్‌లు ఇస్తున్నారు.. పని చెప్పకుండానే జీతాలు ఖాతాల్లో వేస్తున్నారు..! అచ్చం సినిమాను తలపించే ఈ తంతు చూసి, స్వర్గం చేతికి అందినంత సంబరపడిపోతున్న యువతకు, ఆ తర్వాత నరకాన్ని చూపిస్తున్నారు. అసలు ఈ మాయాజాలం వెనుక ఉన్న మర్మమేంటి? నిరుద్యోగుల ఆశను పెట్టుబడిగా పెట్టి ఆడుతున్న ఈ దోపిడీ నాటకం సూత్రధారులెవరు? వీరి వలలో చిక్కకుండా ఉండాలంటే ఏం చేయాలి?

- Advertisement -

సాఫ్ట్‌వేర్‌ కొలువుల మీద యువతకున్న మోజును కొన్ని ముఠాలు సొమ్ము చేసుకుంటున్నాయి. అచ్చం కార్పొరేట్ కంపెనీలను తలపించేలా కార్యాలయాలు తెరిచి, నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఇలాంటి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. చింతల్‌కు చెందిన భార్గవ్‌ అనే వ్యక్తి మాదాపూర్‌లో ‘సాఫ్ట్‌టెక్‌ సొల్యూషన్స్‌’ పేరిట చేసిన మోసం ఈ చీకటి కోణానికి ఒక ఉదాహరణ మాత్రమే.

పక్కా ప్రణాళిక.. పడికట్టుగా అమలు : ఈ మోసాల వెనుక పక్కా వ్యూహం, పకడ్బందీ ప్రణాళిక దాగి ఉంది. నిరుద్యోగులను నమ్మించడానికి ఈ ముఠాలు దశలవారీగా వల పన్నుతున్నాయి.
లీగల్ ముసుగు: తొలుత, తమ సంస్థలను మినిస్ట్రీ ఆఫ్ కంపెనీ అఫైర్స్ (MCA)లో ఎల్‌ఎల్‌పీ లేదా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా నమోదు చేయించుకుంటున్నారు. ఆకర్షణీయమైన వెబ్‌సైట్‌ను రూపొందించి, తాము చేసే ప్రాజెక్టుల గురించి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇది చూసిన నిరుద్యోగులు, ఇది నిజమైన కంపెనీయేనని సులభంగా నమ్మేస్తున్నారు.

ఐటీ హబ్‌లే అడ్డా: మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రాంగూడ వంటి ఖరీదైన ఐటీ ప్రాంతాల్లోనే కార్యాలయాలను అద్దెకు తీసుకుంటున్నారు. దీంతో బాధితులకు అనుమానం రాదు. నిపుణుల అంచనా ప్రకారం, హైదరాబాద్ పరిసరాల్లో ఇలాంటివి సుమారు 1,500 నుంచి 2,000 కంపెనీలు ఉండగా, వాటిలో 90 శాతానికి పైగా మోసపూరితమైనవే కావడం గమనార్హం.

డేటా సేకరణ: కోచింగ్ సెంటర్లు, జాబ్ కన్సల్టెన్సీల నుంచి ఫ్రెషర్ల డేటాను కొనుగోలు చేసి, వాట్సప్ లేదా ఎస్ఎంఎస్‌ల ద్వారా వారికి గాలం వేస్తున్నారు.

నమ్మించడానికి నానా తంటాలు : ఒక్కసారి తమ వలలో చిక్కి డబ్బు (రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు) చెల్లించాక, బాధితులకు పూర్తి నమ్మకం కలిగించడానికి ఈ ముఠాలు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి.

కార్పొరేట్ ట్రీట్‌మెంట్: బాధితులకు వెంటనే అధికారిక ఆఫర్ లెటర్లు, ఐడీ కార్డులు, సెకండ్‌హ్యాండ్ ల్యాప్‌టాప్‌లు అందిస్తున్నారు. దీంతో నిజంగానే ఉద్యోగం వచ్చిందని వారు సంబరపడిపోతారు.
నెల జీతాల ఎర: ఒకట్రెండు నెలలు శిక్షణ పేరుతో కాలయాపన చేసి, ఆ తర్వాత ఉద్యోగంలో చేరారంటూ నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు జీతాలు కూడా చెల్లిస్తున్నారు. ఈ జీతాలు బాధితులు కట్టిన డబ్బులో నుంచే ఇస్తుండటం గమనార్హం.

గొలుసుకట్టు మోసం: జీతాలు వస్తుండటంతో, తమకు ఉద్యోగం వచ్చిందని నమ్మిన బాధితులు తమ స్నేహితులను, బంధువులను కూడా ఇదే కంపెనీలో చేర్పిస్తున్నారు. దీంతో ముఠాలకు కొత్త బాధితులు సులభంగా దొరుకుతారు. కొన్ని నెలలు గడిచాక, “ప్రాజెక్టులు ఆగిపోయాయి, క్లయింట్లు మోసం చేశారు” అంటూ ప్లేటు ఫిరాయించి, కార్యాలయానికి తాళం వేసి ఉడాయిస్తున్నారు. బాధితులు గట్టిగా నిలదీస్తే, “మేం అందరికీ ముట్టజెప్పాం, ఎక్కడైనా చెప్పుకోండి” అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బాధితులు వాపోతున్నారు.

తెర వెనుక ‘బ్యాక్‌డోర్‌’ బాగోతం : స్టార్టప్‌ కంపెనీల పేరుతో మోసం చేయడం ఒక ఎత్తయితే, మరో రకం ముఠాలు ‘బ్యాక్‌డోర్‌ ఎంట్రీ’ పేరుతో వల విసురుతున్నాయి. ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీల హెచ్‌ఆర్ మేనేజర్లు తమకు తెలుసునని, డబ్బు ఇస్తే ఎలాంటి పరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలుకుతున్నాయి. ఇంటర్వ్యూలో ఏం అడుగుతారో ముందుగానే చెబుతామని, అంతా తామే చూసుకుంటామని చెప్పి లక్షల్లో డబ్బులు గుంజుతున్నాయి. తీరా డబ్బులు చేతికి అందాక ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి కనపడకుండా పోతున్నాయి.

నిపుణుల హెచ్చరిక: డబ్బు అడిగితే మోసమే : “ఏ ప్రముఖ, నిజాయితీ గల సాఫ్ట్‌వేర్‌ కంపెనీ కూడా ఉద్యోగం ఇవ్వడానికి అభ్యర్థుల నుంచి డబ్బులు డిమాండ్ చేయదు” అని ఐటీ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ‘బ్యాక్‌డోర్‌ ఎంట్రీ’, ‘డబ్బు కడితే ఉద్యోగం’ వంటి మాటలు వినపడితే అది కచ్చితంగా మోసమేనని అనుమానించాలని హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు సైతం అప్పులు చేసి మరీ పిల్లల భవిష్యత్తు కోసం ఇలాంటి మోసగాళ్లకు డబ్బులు సమర్పించుకోవద్దని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad